దయచేసి అందరూ అర్థం చేసుకోవాలంటున్న సోనూసూద్
ఒక మంచి పని చేయాలనుకుంటే దాన్ని అడ్డుకునేవారు, ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. తోటి మనిషికి సాయం చెయ్యాలన్న ఆలోచన కూడా మనసులోకి రానివ్వని కొందరు చేసే వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వారిపట్ల సిల్లీగా బిహేవ్ చేయడం ఎంతవరకు సబబు. ప్రస్తుతం సోనూసూద్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. `ప్రార్థించే పెదాలకన్నా సాయం చేసే చేతులే మిన్న` అని మదర్ థెరిస్సా చెప్పిన దాన్ని తుచ తప్పకుండా పాటిస్తూ సోనూసూద్ ముందుకెళ్తున్నాడు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు అందరూ ముగ్ధులవుతుంటే కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆయన్ని రకరకాలుగా ఆట పట్టిస్తున్నారు. ఇదీ మన దేశంలో ఉన్న దుస్థితి. ఎవరు ఎన్ని విధాలుగా ఆటంకాలు కలిగించినా తన పట్టుదలను మాత్రం విడిచిపెట్టడం లేదు సోను. ఇప్పటికే అతను సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతున్నాయని, కొన్నాళ్ళకు అతను ఉంటున్న ఇల్లు తప్ప మరేమీ మిగిలేలా లేదని అతని స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలో ఏ సినిమా సెలబ్రిటీ చేయనన్ని సేవలు ప్రజలకు చేస్తున్న సోనూ సూద్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. తమ సిల్లీ సమస్యల్ని తీర్చాలంటూ సెటైరిక్‌గా పోస్టులు చేస్తున్నారు. వాటిపై అంతే సెటైరిక్‌గా స్పందిస్తున్నారు సోనూ. “సోనూ సూద్! నా మొబైల్లో నెట్ స్పీడ్ దారుణంగా ఉంది. దాన్ని పెరిగేట్లు చేయవా’’ అంటూ మంజు శర్మ అనే నెటిజన్ ట్వీట్ చేసింది. దాన్ని ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకున్న సోనూ “రేపు ఉదయం వరకు ఓపిక పట్టండి. ఎందుకంటే నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. ఒక వ్యక్తికి చెందిన కంప్యూటర్ను రిపేర్ చేస్తున్నాను“ అంటూ “వివాహ సమస్యలు, ట్రైన్ టిక్కెట్లు బుక్ చేయటం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చటం వంటి గొప్పగొప్ప పనులు చెబుతున్నారు. దయ చేసి అర్థం చేసుకోండి’’ అని ట్వీట్ చేశాడు. చూశారా! ఒక మంచి పని చెయ్యాలంటే ఎన్ని అడ్డంకులు వస్తాయో! ఇకనైనా ఇలాంటి పనికిరాని ట్వీట్లతో గొప్ప మనసుతో సేవ చేసే సోనూ సూద్లాంటి దాతని ఇబ్బంది పెట్టకుండా ఉంటే సేవ చేయడం కంటే గొప్ప పని అని సోనుని సపోర్ట్ చేస్తున్న నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.













