ఆ ఆలోచన లేదు… పది మందికి సాయం చేయడమే నా ఏకైక లక్ష్యం : సోనూ సూద్
ప్రార్ఘించే పెదాల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటూ మదర్ థెరిస్సా చెప్పిన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు సోనూ సూద్. అందుకే ఇప్పడు దేశమంతా అతన్ని హీరో అంటూ కొనియాడుతోంది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఎవరెవరికి ఎలాంటి సాయాలు అందించాడు, కష్టకాలంలో ఎంతమందిని ఆదుకున్నాడు, సొంత ఊరికి చేరుకోలేక అల్లాడుతున్న ఎంతమందిని సొంత గూటికి చేర్చాడు అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతేకాదు, ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాడు. సోనూ సూద్ అంటే అందరికీ అరుంధతిలోని పశుపతి క్యారెక్టరే గుర్తొస్తుంది. ఆ సినిమాలో అంత భయంకరమైన విలన్గా నటించినా, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విలన్గా కనిపించినా, నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనే పేరు తెచ్చుకున్నారు.
ఇతరులకు సాయం చేయడమే తన లక్ష్యం అంటూ ముందుకు వెళ్తున్నాడు సోను. ప్రజల కోసం ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడని సోనూ సూద్ గురించి కొందరు అభిప్రాయపడుతున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. “పదిమందికి సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు. గత పది సంవత్సరాలుగా నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అయితే నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పాను. నాతోపాటు నా కుటుంబ సభ్యులకు కూడా సాయం కోరుతూ అనే మెయిల్స్ వస్తాయి. వారిలో అత్యవసర సాయం ఎవరికి కావాలో గుర్తించి మా వంతుగా వారికి సహాయం చేస్తున్నాం. నీతి గోయల్ అనే మిత్రుడు వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేసే సమయంలో నాకు సహకరించాడు. అలాగే నాతో కలిసి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది యువకులు నాతో కలిసి పనిచేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం చేయడమే మా లక్ష్యం. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఏ ఒక్కరూ ఒంటరిగా చేయలేరు. మనకు సరైన ఆలోచన ఉన్నప్పుడు అనేక మంది ముందుకు వస్తారు. సాయం కోరేవారి సమస్య నిజమా కాదా అనే విషయాన్ని సైతం మా బృందం పరిశీలిస్తుంది. పది శాతం మంది అబద్ధాలు చెప్పి సాయం పొందినా మిగతా 90 శాతం మంది నిజమైన వారికి సాయం అందుతోందన్న సంతోషం కలుగుతోంది“ అన్నారు సోనూ సూద్.













