సినిమా స్టయిల్లో ఫోటోల కోసం నాగలి లాగారట…. పాపం సోను సూద్!
ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టులు అదిగో పులి ఇదిగో మేక లా తయారయ్యాయి. మనం చూసేవన్నీ నమ్మనక్కర్లేదు, అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని మరేదో అంటూ ప్రచారం చేస్తూ ఉంటారని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇటీవల చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లె లో ఇద్దరమ్మాయిలు నాగలి తరహా పనిముట్టును లాగుతూ ఉండటం, వెనుక వారి తల్లి విత్తనం సాగిస్తూ ఉండటం, ఆ ఫొటో వైరల్ గా మారడం, ఆ విషయంపై సోనూసూద్ స్పందించడం, సాయంత్రానికే వారికి ట్రాక్టర్ బుక్ చేసి పంపంపించడం. ఈ విషయంపై మాజీ సి యం చంద్రబాబు నాయుడు స్పందిచేయడం, సోషల్ మీడియా లో, తెలుగు న్యూస్ పేపర్లలో, టివి ఛానల్ లలో, ఈ పరిణామాలన్నీవిపరీతంగా వైరల్ అయ్యి ఈ వార్తకు ప్రచారం జరిగింది. ఆ సంగతంతా అలా ఉంటే..పై ఫొటో వైరల్ గా మారిన నేపథ్యంలో.. ఆ వెంటనే స్థానిక ఎంపీడీవో అక్కడకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరణను ప్రముఖ దినపత్రిక ‘ది హిందూ’ ప్రచురించింది.
వాస్తవానికి ఎద్దులాగినట్టుగా మనిషి నాగలి లాగడం అనేది ఏ మాత్రం సాధ్యం అయ్యే పని కాదు. వ్యవసాయం మీద ఏ మాత్రం అవగాహన ఉన్నా ఆ విషయం తెలుస్తుంది. సినిమాల్లో అలాంటి విపరీత సీన్లు చూపిస్తూ ఉంటారు. నర్గిస్ చిత్రం ‘మదర్ ఇండియా’ లో కొడుకులు నాగలి పడితే తల్లి ఎద్దు స్తానం లో లాగుతున్నట్టు మెయిన్ గా ఆ పోస్టర్ నే పెట్టారు ఆ చిత్రం అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది. సెంటిమెంట్ ను పండించడానికి అలాంటి సీన్లు తీసి జనాలను భావోద్వేగానికి గురిచేస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం మనుషులను నాగలి కాడికి కట్టి లాగడం సాధ్యం కాదు. లాగినా నాగలి నేలలోకి దిగేంత ఒత్తి పట్టుకోవడమూ సాధ్యం కాదు. అలా ఎవరైనా చేశారంటే.. అది సేద్యమూ కాదు! సరిగ్గా అదే జరిగిందట ఈ ఫొటోలో కూడా. ఈ విషయాన్ని ఎంపీడీవో చెప్పినట్టుగా హిందూ పత్రిక రాసింది. వారి విషయం వైరల్ అయ్యాకా ఎంపీడీవో ఆ ఊరికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు.
ఆ అమ్మాయిలు సరదాగా ఆ పని చేశారని, నిజానికి అక్కడ ఎద్దులు లేదా ట్రాక్టర్ దొరకని పరిస్థితి కానీ, వాటికి డబ్బులిచ్చి పని చేయించుకోలేని ధీన స్థితిలో కానీ వారు లేరట. అసలు ఆ అమ్మాయిలు ఆ ఊర్లోనే ఉండరట. లాక్ డౌన్ కాబట్టి ఆ ఊరికి వచ్చారని తెలుస్తోంది. వచ్చిన వాళ్లు సేద్యం పనికి వెళ్లారు. అక్కడ ఫొటోలు తీసుకోవడానికి, వీడియోల కోసం సెల్ఫీ లు తీసుకోడానికి అలా కాడిని లాగారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసరికి అది వైరల్ అయ్యింది. వైరల్ అయ్యాకా.. వాటికి ఎవరికితోచిన భాష్యాలు వారు అంటించారు. కృష్ణ మూర్తి అనే వ్యక్తి సోను సూద్ అకౌంట్ కి ట్యాగ్ చేసాడు దానికి పాపం సోనూసూద్ అలా స్పందించేశాడు.
ఆ పల్లెకు వెళ్లి వచ్చిన ఎంపీడీవో మాత్రం.. వాళ్లు అదంతా కావాలని-సరదాగా చేసుకున్నారని, అంత దయనీయమైన పరిస్థితుల్లో వారు లేరని తేల్చి చెప్పారు. విశేషం ఏమిటంటే.. సోనూసూద్ పంపిన ఆ ట్రాక్టర్ ను పంచాయతీకి అప్పగించాలని ఆ కుటుంబం కూడా భావిస్తోందట. అసలు కథ ఇదని సమాచారం!













