థియేటర్స్ కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సో బెటర్ అంటున్న మెగా హీరో
థియేటర్స్ మూతబడి నాలుగు నెలలు దాటింది. ప్రస్తుతం జనం టీవీకి, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి పరిమితమయ్యారు. అసలు థియేటర్స్ అనేవి ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు. దానికి తగ్గట్టుగానే కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చెయ్యడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఆగస్ట్ 1 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పినా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం థియేటర్‌కి వచ్చే జనం వల్ల థియేటర్కిగానీ, నిర్మాతకుగానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా ప్రస్తుత పరిస్థితిలో జనం థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారన్న నమ్మకం ఏ ఒక్కరికీ లేదు. అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండి ఉండొచ్చు. ఈ గందరగోళ పరిస్థితుల్లో థియేటర్ల కోసం ఎదురుచూడడం కంటే ఓటీటీలోనే తమ సినిమా రిలీజ్ చేసేసుకుంటే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించడంలో తప్పులేదు.
ఇప్పటివరకు ఓ రేంజ్ సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇకపై పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. తాజాగా సాయిధరమ్‌తేజ్ హీరోగా నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా నిర్మాతలకు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇచ్చి ఎట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నాయని సమాచారం. మరోపక్క థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయి. ముందు ముందు పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అయితే థియేటర్స్ ఎలా రన్ చేయగలుగుతామని థియేటర్స్ ఓనర్స్ అడుగుతున్నారు. మరి థియేటర్స్, ఓటీటీ మధ్య నడుస్తున్న ఈ రేస్‌లో ఏది ముందడుగు వేస్తుందో మరి.













