Sobhitha Dhulipala: శోభిత చెప్తున్న బ్యూటీ సీక్రెట్స్
హీరో నాగ చైతన్య(Naga Chaitanya) భార్య, నటి శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) ఎలాంటి బట్టలు వేసుకున్నా అందంగా కనిపిస్తూ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలందరూ అందంగా కనిపించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. కానీ శోభిత మాత్రం ఇంట్లో ఉండే సహజ ఉత్పత్తులతోనే చర్మ సంరక్షణ చేసుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తాజాగా వోగ్ బ్యూటీ స్కోప్(Vogue Beauty Scope) తో మాట్లాడిన శోభిత అందంగా కనిపించాలంటే మేకప్స్ పని లేదని, అన్నింటికంటే ముందు మన మనసు అందంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలని అప్పుడే ముఖం ప్రకాశంతంగా ఉంటుందని చెప్పిన శోభిత, ఆత్మ విశ్వాసం కూడా మనల్ని అందంగా చూపిస్తుందని, అసలైన అందం లోపలి నుంచే వస్తుందని శోభిత పేర్కొంది.
ఇక తన చర్మ సంరక్షణ గురించి మాట్లాడుతూ తన చర్మం ఎలాంటి వాతావరణంలోనైనా పొడిబారుతూ ఉంటుందని, దాని వల్ల తన పెదవులు కూడా డ్రై అయిపోతుంటాయని చెప్పింది. ఈ సమస్యను అధిగమించడానికి మొదట్లో ఎన్ని లిప్ బామ్స్, లిప్ మాస్క్స్ వాడిని ఫలితం కనిపించలేదని అందుకే ఇంట్లో ఉండే నెయ్యి రాయడం మొదలుపెట్టానని, ఆ తర్వాత తన పెదవులు చాలా బాగా తయారయ్యాయని చెప్పింది. ఇక చర్మానికి జుట్టుకు తాను కొబ్బరి నూనెను ఎక్కువగా వాడతానని, కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుందని, జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల తనకున్న మైగ్రేన్ సమస్య నుంచి బయటపడినట్టు శోభిత చెప్పుకొచ్చింది. అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడకపోయినా లిప్ బామ్, ఐ లైనర్, కాటుక లేకుండా మాత్రం తాను ఉండలేనని, కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటానని, మేకప్ వేసుకునేటప్పుడు బ్లూ మేకప్ వేసుకోవడం ఇష్టమని తెలిపింది శోభిత.













