అసలు సినిమాకే దిక్కు లేదంటే మళ్లీ సీక్వెలా?
బాహుబలితో మొదలైన రెండు పార్ట్‌ల ట్రెండ్ టాలీవుడ్ లో ఇప్పటికీ కొనసాగుతుంది. మీడియం రేంజ్ సినిమాలకు కూడా సీక్వెల్స్ తీయడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. రిలీజ్ చేసిన అసలు సినిమానే సరిగా పెర్ఫార్మ్ చేయనప్పుడు ఇక దానికి సీక్వెల్స్ ఎలా తీస్తారు? దానికి జనాలెలా థియేటర్లకు వస్తారనేది అసలు పాయింట్.
గతేడాది రవితేజ చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎంతటి డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాకు సీక్వెల్ హింట్ ఇచ్చారు కానీ ఫైనల్ రిజల్ట్ చూశాక దాని గురించి మాట్లాడింది లేదు. ఇక రీసెంట్గా ఈ వారం రిలీజైన సినిమాల్లో కూడా రెండు సినిమాలు సీక్వెల్‌కు హింట్ ఇచ్చాయి. బోయపాటి- రామ్ కాంబోలో వచ్చిన స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
మాస్ ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అయ్యారు కానీ సినిమాలో ఫైట్స్ తప్ప పెద్దగా కంటెంట్ లేకపోవడంతో నార్మల్ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మాస్ మూవీ కావడం, దానికి తోడు రామ్- బోయపాటి క్రేజీ కాంబో అవడంతో సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. కానీ ఇది హిట్ అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చాడు బోయపాటి.
స్కందతో పాటూ ఈ వారం రిలీజైన సినిమా పెదకాపు1. ఈ సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు మంచి పేరున్న కాస్టింగ్ కూడా లేకపోవడంతో కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రిలీజ్ కు ముందే చెప్పాడు. కానీ మొదటి సినిమా ఫ్లాప్ గా ఉన్నప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసి మరింత నష్టాన్ని ఏ నిర్మాత మాత్రం కావాలని తెచ్చుకుంటారు.













