పూరీపై స్కంద ఎఫెక్ట్
మాస్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్న రామ్ పోతినేనికు ది వారియర్, స్కంద సినిమాలు నిరాశనే మిగిల్చాయి. తన మార్కెట్ ను పెంచుకోవాలంటే కమర్షియల్ సినిమాల వల్లే అవుతుందని గ్రహించిన రామ్, దానికి తగ్గట్టుగా అడుగులేసినప్పటికీ అవన్నీ బెడిసి కొడుతున్నాయి. దీంతో ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు పూరీ జగన్నాథ్ పై పడింది.
రామ్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డబుల్ ఇస్మార్ట్. మూడేళ్ల ముందు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా విషయంలో ఇకపై షూట్ చేయాల్సిన భాగాన్ని పూరీ మరోసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం వచ్చింది.
దానికి కారణం స్కంద సినిమానే. స్కంద సినిమాలో లాగా రామ్ తో ఓవర్ ది బోర్డ్ ఫైట్స్ చేయించి, ఊర మాస్ హీరోగా చూపిస్తే జనాలు చూసేందుకు రెడీగా లేరనే విషయాన్ని పూరీ దృష్టిలో ఉంచుకుని డబుల్ ఇస్మార్ట్ ను చేయాల్సి ఉంది. లేకపోతే స్కందకు వచ్చిన ఫలితమే ఈ సినిమా విషయంలో కూడా చూడాల్సి ఉంటుంది.
కాబట్టి డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ ప్రతీ అంశంలోనూ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్కంద సినిమాకు ఆడియో చాలా పెద్ద మైనస్. కాబట్టి పూరీ, మణిశర్మతో మంచి ఆల్బమ్ కంపోజ్ చేయించుకోవాలి. సంజయ్ దత్ లాంటి హీరో విలన్ గా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని సరైన రీతిలో వాడుకోగలగాలి. డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ ఇటు రామ్ తో పాటూ అటు పూరీకి కూడా ఎంతో అవసరం కాబట్టి పూరీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













