Sirish: అనిల్ లేకపోతే ఇవాళ మేం లేము: శిరీష్
నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఒకప్పుడు వరుస హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన సరైన సక్సెస్లు లేక ఇబ్బంది పడుతున్నాడు. గత నాలుగైదేళ్లలో దిల్ రాజు నుంచి ఎన్నో ఫ్లాపు సినిమాలొచ్చాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన ఆశలన్నీ సంక్రాంతి పైనే పెట్టుకుని ఆయన బ్యానర్ నుంచి రెండు సినిమాలను రిలీజ్ చేశాడు.
అందులో మొదటిగా వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). రూ. 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా ఓపెనింగ్స్ వరకు ఫర్వాలేదనిపించినా తర్వాత మాత్రం కలెక్షన్లు బాగా నెమ్మదించాయి. గేమ్ ఛేంజర్ వల్ల దిల్ రాజు భారీగానే నష్టపోవాల్సి ఉందనే విషయం అందరికీ అర్థమైంది. మరోవైపు రెండో సినిమాగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధించబోతుందని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు తమ్ముడు శిరీష్(Sirish) సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ పనైపోయిందనుకున్న టైమ్ లో అనిల్ వల్ల నిలబడ్డామని, అతనికి ఋణపడి ఉంటామని శిరీష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజు అనిల్ లేకపోతే మేం లేమని, మేం బావిలో పడిపోయామనుకునే టైమ్ కు అనిల్ మమ్మల్ని బయటపడేశాడని శిరీష్ తెలిపాడు.













