చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్న సిద్ధార్థ్
హీరో సిద్ధార్థ్ తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. 2003లో `బాయ్స్` చిత్రంతో తమిళ్లో ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ `నువ్వొస్తానంటే నేనొద్దంటానా` చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. బాయ్స్, యువ చిత్రాలు దీనికంటే ముందే తెలుగులో వచ్చినా అవి అనువాద చిత్రాలు తెలుగులో అతను చేసిన మొదటి సినిమా `నువొ్స్తానంటే..`. ఆ తర్వాత `బొమ్మరిల్లు` వంటి అవార్డ్ విన్నింగ్ మూవీ చేసినా అటుపై అతనికి ఎక్కువగా విజయాలు లభించలేదు. తమిళ్లో అడపా దడపా సినిమాలు చేస్తున్న అతను ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు.
`ఆర్ ఎక్స్ 100` చిత్రంతో భారీ హిట్‌ని అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న `మహాసముద్రం` చిత్రంలో శర్వానంద్‌తో కలిసి నటించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. స్క్రిప్ట్ పక్కాగా వచ్చిందని తెలుస్తోంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు షూటింగులకు అనుకూలంగా లేకపోవడంతో మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ స్నేహితులుగా కనిపిస్తారు.
స్నేహం, ప్రేమ ప్రధానాంశాలుగా రూపొందిన ఈ కథకు శర్వానంద్, సిద్ధార్థ్ అయితేనే బాగుంటుందని అజయ్ భూపతి భావిస్తున్నారు. ఈ కథకు క్రైమ్ బ్యాక్‌డ్రాప్ కూడా కొంత ఉంటుందట. తెలుగులో `సమ్మోహనం` చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతిది రావ్ హైదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది.













