మరో మారు మహేష్ పక్కన శృతి హాసన్ కి ఛాన్స్
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ శృతిహాసన్. ఆ మధ్య సినిమాల నుంచి కాస్త విరామం తీసుకొన్న ఈ బ్యూటీ రవితేజ ‘క్రాక్’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయిందని తెలుస్తోంది. శృతిహాసన్… పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా ఒక ముఖ్యపాత్రలో నటిస్తోందట. ఇందులో పవన్ భార్యగా నటిస్తోందట. పవన్ కళ్యాణ్, శృతిహాసన్ ఇదివరకు ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ‘వకీల్ సాబ్’లో శృతి నటిస్తే అప్పుడు వీళ్లిద్దరు కలిసి మూడవసారీ వర్క్ చేసినట్లు అవుతుంది. పవన్ తో ఇలా మళ్ళీ మళ్ళీ శృతి హాసన్ జోడీ కడుతూ ఆ రకంగా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ మరొక టాలీవుడ్ అగ్ర హీరోతో రెండవ సారి నటించనుందని తెలుస్తోంది.
ఇక విషయానికెళ్తే… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో శృతి హాసన్ రెండవసారి జోడీ కట్టనుందని ఇండస్ట్రీలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్, శృతి ఇదివరకు కొరటాలశివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో వీరి జోడీ కూడా అంతే బ్లాక్ బస్టర్ అయింది. స్క్రీన్ పై మహేష్, శృతి జోడీ ఎంతో ఫ్రెష్ గా కనిపించి అభిమానులని అలరించింది. మహేష్ బాబు, శృతి హాసన్ మళ్ళీ కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకునేది వంశీపైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కించే సినిమాలోనట. వంశీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శృతి పేరుని పరీశీలిస్తున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవడు’ సినిమాలో రాంచరణ్, శృతిహాసన్, కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. శృతి ఎలాగో ఇప్పటికే వంశీ పైడిపల్లితో వర్క్ చేసింది కాబట్టి శృతిని ఈ సినిమాలోనూ వంశీ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళుతుందట. అయితే, మహేష్ – శృతి హాసన్ మళ్ళీ రెండవసారీ కలిసి నటిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఈ విషయం గురించి స్పష్టత ఉండదు.













