మరో ఇరవై సినిమాల తర్వాత… దాని గురించి ఆలోచిస్తా
జీవితాన్ని కెరీర్‌ను మరింత ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని ప్రముఖ నటి శ్రియా శరన్ చెప్పుకొచ్చారు. ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం కెరీర్‌ను మొదలుపెట్టిన ఆమె ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో ఒక నటి అంత సుదీర్ఘమైన కెరీర్‌ను కొనసాగించడమంటే మాటలు కాదు. ఫిజిక్ పరంగా కూడా ఇంకా నాజూకుతనాన్ని కోల్పోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే నేటికీ కుందనపు బొమ్మలా మెరిసిపోతుండటం ఆమె ప్రత్యేకత అని పరిశ్రమలో అంటున్నారు. అందుకే కాబోలు భారతీయ సినీరంగంలో ఏదోఒక భాషలో ఆమెకు సినీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. గతేడాది రష్యాకు చెందిన ఆండ్రూను పెళ్లి చేసుకుని సినీరంగం పట్ల మక్కువతో రిటైర్ కాకుండా సినిమాలు చేస్తూండటం ఆమె అభిరుచిని తేటతెల్లం చేస్తోంది.
హాలీవుడ్ సినిమా ది ప్రపోజల్ ఆధారంగా తమిళంలో రూపొందుతున్న ఓ రీమేక్‌లో నటిస్తున్న ఆమె చిత్రం షూటింగ్ కోసం లండన్ వెళ్లింది. అక్కడ కాస్త బ్రేక్ తీసుకుని తన భర్త ఆండ్రూతో కలిసి మెక్సికోకు చేరిన ఆమె అక్కడి బీచ్‌లో విహారం చేస్తోంది. ఆ మేరకు ఆండ్రూతో కలిసి తీయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదిలావుండగా పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటున్నా.. ఇంకా జీవితాన్ని, కెరీర్‌ను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. మరో 20 సినిమాలు చేసిన తర్వాత సంతానం గురించి ఆలోచిస్తా అంటూ శ్రియా చెప్పుకొచ్చింది.













