శివం భజే ట్రైలర్ టాక్
యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అశ్విన్ బాబు సినిమాలు తక్కువ చేస్తున్నా అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తూనే ఉన్నాడు. గతేడాది హిడింబ అనే డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అశ్విన్. మంచి ప్రయత్నం అని పేరైతే వచ్చింది కానీ ఆ సబ్జెక్ట్ ను సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఢీలా పడింది.
ఇప్పుడు అశ్విన్, శివం భజే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అఫ్సర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూడ్డానికి ఆసక్తికరంగా ఉంది. ఇండియాని మ్యాప్ లో లేకుండా చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్న పాకిస్తాన్ అందుకోసం ప్రమాదకరమైన శక్తులను రంగంలోకి దించుతుంది.
దీనివల్ల అనూహ్య పరిస్థితుల్లో ఎంతో మంది హత్యకు గురవుతారు. దీన్ని ఛేదించడం సీబీఐకు కూడా సవాల్ గా మారుతుంది. బాధితులైన వారిలో హీరో కూడా ఒకడు. ప్రాణాలతో బయటపడి అసలు ఇదంతా చేస్తుందెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నానికి దైవ సాయం కూడా తోడ్పడుతుంది. అదెలా అనేది తెరపైనే చూడాలి. కథ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ దాన్ని శివుడితో ముడిపెట్టిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంది. మరి ఈ సినిమా అశ్విన్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













