విడాకులు కోసం కోర్టుకెక్కనున్న శర్వా
రీసెంట్ గా మనమే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రస్తుతం అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో బైక్ రైడర్ నేపథ్యంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రేస్ రాజా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇది కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా, సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో ఓ సినిమాను చేయనున్నాడు శర్వా. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సామజవరగమనతో మంచి హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు ఇప్పుడు శర్వా కోసం మరో ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అందుకోసం ఈసారి రామ్ అబ్బరాజు విడాకులు అనే కాన్సెప్ట్ ను తీసుకున్నాడట. ఈ కాన్సెప్ట్ పాతదే అయినా దాన్ని డైరెక్టర్ కొత్త యాంగిల్ లో చూపిస్తూ కథను మలచినట్లు తెలుస్తోంది. ఇందులో శర్వాకు జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న శర్వా ఫ్యాన్స్ సినిమాపై ఉన్న అంచనాల్ని ఇంకా పెంచుకుంటున్నారు. మరి రాబోయే సినిమాలతో శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













