రేప్ చేస్తాం… చంపేస్తాం.. బాలీవుడ్ తారలకు తప్పని బెదిరింపులు!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. నెపోటిజం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అతనికి జరిగిన చేదు అనుభవాల వల్ల అందరికీ తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అప్పటి నుంచి పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. కొంతమంది నటీనటులను, దర్శకనిర్మాతలను టార్గెట్ చేస్తూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో అలియా భట్ సోదరి షాహిన్ భట్‌ను కూడా చేర్చారు. ఆమెను ట్రోల్ చేస్తూ పరుష పదజాలంతో విమర్శిస్తున్నారు. మరికొంతమంది కామెంట్స్ హద్దుమీరి ఉంటున్నాయి. ఒక పక్క కంగనా రనౌత్ లాంటి వారు నెపోటిజంపై వీలు దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నెటిజన్లు మాత్రం వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారందర్నీ ఏకి పారేసే పని పెట్టుకున్నారు.
కొందరు నెటిజన్స్ నుంచి తనకు నిత్యం బెదిరింపులు వస్తున్నట్లు షాహిన్ భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. తనపై అత్యాచారం చేస్తామని, చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు సోషల్ మీడియాలో తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నారని షాహిన్ భట్ వెల్లడించింది. ఈ బెదిరింపులను సీరియస్‌గా తీసుకున్న షాహిన్ భట్…సోషల్ మీడియాలో ఎవరైనా హద్దులుదాటి ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. సదరు బెదిరింపులను క్లిప్స్ రూపంలో తీసుకున్నానని, బెదిరింపు దారులను ఐపీ అడ్రస్‌ల ద్వారా పట్టుకుని చట్టబద్ధంగా శిక్షిపడేలా చేస్తానని షాహిన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. కొందరు హద్దులు మీరి అసభ్యకరంగా దూషిస్తూ…అందుకు కారణం కూడా తనే అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారని షాహిన్ మండిపడింది దేశంలోని చాలా మందిలో ఉదారత కంటే ద్వేషం ఎక్కువయ్యిందన్న భావన కలుగుతోందని ఆమె చెప్పింది. కొందరి ప్రవర్తన చూస్తే వారి ఇంట్లో తల్లి, సోదరి, భార్య రూపంలో మహిళలు ఉన్నారన్న విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించినట్టు తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.













