Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తన అభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మైలురాయిని ఎట్టకేలకు సాధించారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తన 2023 చిత్రం ‘జవాన్’ (Jawan) కు ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని షారుఖ్ ఖాన్ స్వీకరించారు. 30 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో ఉన్న షారుఖ్‌కు ఇదే మొదటి జాతీయ అవార్డు కావడం విశేషం.
‘జవాన్’ చిత్రంలో షారుఖ్ ఖాన్ అద్భుతమైన నటన, పోరాట సన్నివేశాలు, ఆకట్టుకునే నైపుణ్యం ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘కింగ్’లో తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి నటించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.