కేసీఆర్ పాత్రలో శ్రీకాంత్ ?
టాలీవుడ్లో బయోపిక్‌ల సీజన్ మొదలైంది. ఇప్పటికే సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో బయోపిక్ రానుందని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం ఆధారంగా కూడా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ దేవుడు అనే చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడనేది టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇప్పుడు ఆపరేషన్ 2019 చిత్రంలో నటిస్తున్న శ్రీకాంత్.. ఆ తర్వాత కేసీఆర్ బయోపిక్‌లో నటించడానికి ఓకే చెప్పాడని, అందులో భాగంగానే ఇప్పటి నుండే కేసీఆర్ పలు ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు చూస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నటుడు, రచయిత, ఉత్తేజ్ కూడా ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.













