Krishnaveni: నటి, నిర్మాత కృష్ణవేణి ఇక లేరు
ఈరోజు ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. నందమూరి తారక రామారావు గారిని మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు. తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, నిర్మాత కృష్ణవేణి (Krishnaveni) ఫిబ్రవరి 16వ తేదీ తెల్లవారుఝామున 4.00 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు.
తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణిది ఓ ప్రత్యేక అధ్యాయం. తొలితరం మహిళలలో నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి. 1924, డిసెంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. తండ్రి డాక్టర్ కృష్ణారావు. బాల్యం నుండి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. బాల తారలతో ‘అనసూయ’ (Anasuya) చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి. పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన ‘తులాభారం’ (Thulabharam) నాటకాన్ని చూసి టైటిల్ రోల్ కు ఆమెను ఎంపిక చేశారు. అప్పుడు కృష్ణవేణి వయసు పది సంవత్సరాలు. ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్ కత్తాలో జరిగింది. ఈ సినిమాలో దాదాపు 60మంది బాల బాలికలు నటించారు. ఆ తర్వాత తిరిగి రాజమండ్రి వచ్చిన నాటకాలు వేయడం ప్రారంభించింది. అదే సమయంలో ఆమె తండ్రి కన్నుమూశారు. దాంతో తల్లి, చిన్నానల ప్రాపకంలో పెరిగింది. 1937లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నయ్ తీసుకెళ్ళారు. ఆ సమయంలో ఆమె ‘తుకారం’ సినిమాలో నటించింది. అలా కొన్ని చిత్రాలలో బాట నటిగా రాణించింది.













