మొదటి వారం ఫ్లాప్ అనిపించుకొని ఆ తర్వాత సిల్వర్ జూబ్లీ ఆడింది
రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్ చేసిన ట్రెండ్ సెట్టింగ్ మూవీల్లో `సత్య` ఒకటి. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. జెడి చ్రకవర్తి, ఊర్మిళ జంటగా నటించిన ఈ సినిమా అండర్ వరల్డ్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లో `శివ` తర్వాత అతనికి అంతటి పేరు తెచ్చిన సినిమా ఇది. ఈ సినిమా జూలై 3, 1998లో విడుదలైంది. ఈరోజుకు సరిగ్గా ఈ సినిమా 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రచయిత కోన వెంకట్ ఈ చిత్రంతో తనకున్న అనుభవాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. చావు అంచు వరకు వెళ్లిన నా జీవితానికి ఈ చిత్రం మరో కొత్త జన్మని ఇచ్చిందని తెలిపారు. అవకాశం అనేది దేవుడితో సమానం. అవకాశం ఇచ్చేవాడు భగవంతుడి కంటే ఎక్కువ. ఈ విషయంలో వర్మకు, సత్య సినిమాకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను అని కోన వెంకట్ అన్నారు. 22 సంవత్సరాల క్రితం నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. చావు అంచుకి వెళ్లిన నా జీవితానికి ఒక అవకాశం దక్కింది. ఒక కొత్త జన్మ. రచయితగా ఒక జననం. ఒక కొత్త ప్రయాణం. రామ్ గోపాల్ వర్మ రూపంలో ఒక అవకాశం. ‘సత్య’ సినిమాతో ఒక గొప్ప పునాది. ఈ పునాది మీద ఇప్పటిదాకా 54 అంతస్థుల ఒక రచనా సౌథం నిర్మించుకునే అదృష్టం. మొదటి సినిమాలోనే మూడు బాధ్యతలు. నా జీవితాన్ని మార్చిన ఆ సినిమాని, మా రాముని, ఎప్పటికీ మరిచిపోను` అని కోన వెంకట్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ చిత్రంలో సత్య క్యారెక్టర్‌తో సమానంగా ఉండే బీకూ మాత్రే క్యారెక్టర్‌ను మనోజ్ బాజ్‌పాయ్ ఎంతో అద్భుతంగా పోషించాడు. ఈ సినిమాలో అతను చేసిన పాత్రకుగాను జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయనటుడు అవార్డును గెలుచుకున్నాడు. `సత్య` 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మనోజ్ బాజ్‌పాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ `జూలై 3, 1998.. ఈ తేదీని ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే `సత్య` రిలీజ్ తర్వాత మొదట్లో సినిమా ఫ్లాప్ అన్నారు. ఆ తర్వాత ఇదే సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు సిల్వర్ జూబ్లీ ఆడింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్ అనురాగ్ కశ్యఫ్ ఈ సినిమాకు రైటర్‌గా వర్క్ చేశాడు.













