హీరో, డైరెక్టర్ తనయులు హీరోలుగా సతీష్ వేగేశ్న కొత్త సినిమా!
తెలుగులో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న శ్రీహరి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆయన అకాల మరణంతో టాలీవుడ్ ఓ మంచి నటుడ్ని కోల్పోయింది. ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా `రాజ్‌దూత్` అనే చిత్రంతో గత సంవత్సరం ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ సినిమా విజయం సాధించలేదు. తాజాగా మరో సినిమా కమిట్ అయ్యాడు మేఘాంశ్. శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించిన సతీష్ వేగశ్న దర్శకత్వంలో మేఘాంశ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో మేఘాంశ్తోపాటు సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న కూడా ఒక హీరోగా నటించనున్నాడు. `రాజ్‌దూత్` చిత్రాన్ని నిర్మించిన ఎంఎల్‌వి సత్యనారాయణ ఈ కొత్త సినిమాను కూడా నిర్మించడం విశేషం. ఆగస్ట్ 15 శ్రీహరి జయంతి. ఈ సందర్భంగా మేఘాంశ్ నటించే కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “ఇప్పటివరకు అన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించాను. మొదటిసారి కంప్లీట్ ఎంటర్టైనర్ను చెయ్యాలని డిసైడ్ అయ్యాను. స్ర్ర్కిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం“ అన్నారు. నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని మా లక్ష్య ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తాం. సతీష్‌గారు తీసిన శతమానం భవతి సినిమా నాకు బాగా నచ్చింది. ఆయన డైరెక్షన్ సినిమా చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తాం“ అన్నారు.













