నాకు రెమ్యునరేషన్ ఇస్తావారా?
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలై 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అశ్వినీదత్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని, అప్పటి అనుభవాలను పంచుకున్నారు. అంతేకాదు, చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన హీరో శరత్‌కుమార్ కూడా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో చిరుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ లైవ్ కార్యక్రమంలో శరత్‌కుమార్‌తోపాటు రాధిక కూడా పాల్గొన్నారు. వారు కూడా ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ 30 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే తనను ఒకానొక సమయంలో చిరంజీవి ఎలా అదుకున్నారనే విషయాన్ని ప్రస్తావించారు శరత్‌కుమార్. ‘‘నేను ఒక టైమ్‌లో పూర్తి డౌన్‌ఫాల్‌లో ఉన్నాను. అప్పులు పెరిగిపోయాయి.
ఆ సమయంలోనే ఓ నిర్మాత నా దగ్గరకు వచ్చి చిరంజీవి డేట్స్ తీసుకొస్తే నీకు కొంత డబ్బు వస్తుంది, దాంతో నీ అప్పులు తీరతాయని సలహా ఇచ్చారు. ఇదే విషయం గురించి చిరుకి ఫోన్ చేస్తే హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్నానని చెప్పాడు. వెంటనే బయల్దేరి హైదరాబాద్ వెళ్లాను. పర్సనల్‌గా మాట్లాడాలని చెప్పడంతో వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశాడు చిరు. ప్రేమగా లంచ్ వడ్డిస్తూ సమస్య ఏమిటో చెప్పమన్నాడు. నీ డేట్స్ ఇస్తే నాకు ఉన్న అప్పులు తీరిపోతాయని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా వెంటనే ఓకే చెప్పాడు. నెక్స్ట్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. నేను రెమ్యునరేషన్ ఎంత అని అడిగాను. దానికి చిరంజీవి నాపై ఫైర్ అవుతూ ‘నాకు రెమ్యునరేషన్ ఇస్తావారా? నువ్వు కష్టాల్లో ఉన్నావని చెప్పావుగా. నాకు రెమ్యునరేషన్ వద్దు’ అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది’’ అని కంటతడితో ఆనాటి విషయాను గుర్తు చేసుకున్నారు శరత్‌కుమార్.













