చెప్పిన టైమ్ కంటే ముందే సర్కారు వారి పాట..?
మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గతేడాది జూన్ లో అనౌన్స్ చేసిన ఈ సినిమా కరోనా కారణంగా ఏడాది ఆఖరిన ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ కారణంగానే సినిమా కూడా మరో సంవత్సరానికి రిలీజ్ డేట్ ను పొడిగించారు. గతేడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలైన ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసేశారు కూడా.
అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఈ యేడాదే రిలీజ్ అయ్యే ఛాన్సుందట. వాస్తవానికి మహేష్ ఈ సినిమాకు సైన్ చేశాక, మరో సినిమాకు సంతకం చేసింది లేదు. కథలు వింటూ ఉన్నాడంతే తప్పించి, సినిమాలైతే ఓకే చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా విషయంలో వేగం పెంచనున్నాడంటున్నారు. ఇప్పటికే సెకండ్ షెడ్యూల్ మొదలైపోయింది.
ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ సినిమాకు మహేష్ సైన్ చేసినట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా విషయంలో నెమ్మదితనాన్ని వదిలి త్వరగా సినిమా కంప్లీట్ చేయాలని, దసరా తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న యోచనలో సూపర్ స్టార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసి, ఆ తర్వాత వచ్చే యేడాది వేసవికి త్రివిక్రమ్ తో తీసే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడట మహేష్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.













