ఏపీలో నానికి మరోసారి దసరా రోజులు
నాని కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా దసరా. ఈ సినిమాకు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు నాని. దసరా ఓవరాల్ గా చూసుకుంటే హిట్టే కానీ ఏపీలో మాత్రం సినిమా సరిగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. తెలంగాణ కల్చర్, యాస ఎక్కువగా ఉండటం వల్ల నైజాంలో వచ్చినట్లు అక్కడ కలెక్షన్స్ రాలేదు. దీంతో ఏపీలో దసరా యావరేజ్ గా మిగిలిపోయింది.
దసరా తర్వాత నాని చేసిన హాయ్ నాన్న అన్నిచోట్లా ఒకేలా ఆడి మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ సరిపోదా శనివారం పరిస్థితులు చూస్తుంటే దసరా సిట్యుయేషన్స్ రిపీటయ్యేలా కనిపిస్తున్నాయి. అలా అని సరిపోదా శనివారంలో యాస లాంటి అంశాలేమీ లేవు. మంచి టైమ్ లో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వచ్చింది.
కానీ ఈసారి వర్షాలు నాని మూవీకి బ్రేక్ వేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఈ సినిమాకు దసరా పరిస్థితి తలెత్తేలా ఉంది. తెలంగాణలో వర్షాలు పడ్డా నైజాంకు ఆయువుపట్టు అయిన హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బంది రాలేదు. దీంతో నైజాంలో ఇప్పటికే ఈ సినిమా రూ.8 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇలా లేదు. విజయవాడ, గుంటూరు లాంటి ఏరియాలు వర్షాల వల్ల ఇబ్బందుల్లో పడటం ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కంటే కాస్త ఎక్కువగా వసూళ్లు సాధించిందంతే. మరో 40-45% రికవరీ కావాల్సి ఉంది. ఫుల్ రన్ లో కూడా ఆ రికవరీ జరుగుతుందా లేదా అనేది డౌట్ గానే ఉంది. దీంతో అందరూ మరోసారి దసరా రిజల్టే రిపీటయ్యేలా ఉందంటున్నారు.













