గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డీల్ క్లోజ్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఓ వైపు ఇండియన్2 సినిమా చేస్తూనే శంకర్ గేమ్ ఛేంజర్ వర్క్స్ కూడా చూసుకుంటున్నాడు. ఈ సినిమాలోని మ్యూజిక్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
దీపావళికి గేమ్ ఛేంజర్ నుంచి జరగండి అనే లిరికల్ సాంగ్ రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఈ సాంగ్ రిలీజ్ కు ముందే ఆన్లైన్లో హై క్వాలిటీతో లీక్ అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు నిందితులపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఓ ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఏదైతేనేం మొత్తానికి గేమ్ ఛేంజర్ ఆడియోపై హైప్ మాత్రం పెరిగింది. దీంతో సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు డిమాండ్ ఏర్పడింది. తమన్ కంపోజ్ చేస్తున్న ఈ మ్యూజిక్ కోసం రెండు బడా ఆడియో కంపెనీలు పోటీ పడగా, చివరకు భారీ మొత్తానికి గేమ్ ఛేంజర్ ఆడియో రైట్స్‌ను సరిగమ సంస్థ చేజిక్కించుంది. నాన్ థియేట్రికల్ గానే సినిమాకు మంచి బిజినెస్ అయ్యేలా నిర్మాత దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.













