Sankranthiki Vasthunnam Review: ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటినటులు :విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VTV గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్, ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ, యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
సమర్పణ: దిల్ రాజు, నిర్మాత: శిరీష్
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేది : 14.01.2025
క్లాస్, మాస్, మహిళా ప్రేక్షకులతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా అభిమానించే హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) ఆద్యుడు. మరో వైపు సింపుల్ కధా, కథనాలతో కామిక్ టచ్‌ను జోడించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో దిట్ట అనిల్ రావిపూడి. ఇక ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మీనాక్షి చౌదరి,(Meenakshi Choudary) ఐశ్వర్య రాజేష్ (Iswarya Rajesh) హీరోయిన్స్ గా నటించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) సమర్పణలో నిర్మాత శిరీష్(Sireesh) నిర్మించారు. మరి ఈ రోజు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది..సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచినట్టేనా తెలుసుకుందాం..
కథ :
ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. పార్టీ ప్రసిడెంట్(వీటివి గణేష్) స్పెషల్ పార్టీ అని సత్య ఆకెళ్ళను ఫామ్ హౌస్ కి తీసుకెళ్లడంతో కొంతమంది దుండగులు సత్య ఆకెళ్ళని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు. సత్య కిడ్నాప్ బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు, సీఎం పదవి పోతుందని ఎవరికీ తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడటానికి మాజీ పోలీసాఫీసర్ YD రాజు(వెంకటేష్)ని తేవాలనుకుంటారు. కానీ YD రాజు సిన్సియర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కావడంతో సస్పెండ్ అయి పెళ్లి చేసుకొని రాజమండ్రిలో భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్), పిల్లలతో లైఫ్ గడుపుతూ ఉంటాడు. దాంతో అతన్ని తీసుకురావడానికి అతని మాజీ ప్రేయసి, సత్యకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ మీనాక్షి(మీనాక్షి చౌదరి)వెళ్తుంది. మరి YD రాజు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడా? మీనాక్షితో రాజు ఎందుకు విడిపోయాడు? రాజు మాజీ ప్రేయసి వచ్చాక భార్య ఎలా మారింది? సత్య ఆకెళ్ళని రాజు కాపాడాడా? మీనాక్షి, రాజు విడిపోయేందుకు కారణాలేంటి.. ప్రేయసి వచ్చాక రాజు భార్య ఎలా మారింది.. సత్య ఆకెళ్లను కిడ్నాప్ నుంచి రాజు కాపాడాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటుల హవబావాలు:
వెంకటేష్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ సాలిడ్ గా వర్కవుట్ అయ్యాయి. వెంకీ మామ తన రోల్ లో అదరగొట్టారని చెప్పాలి. తన ఇంట్లో తన కొడుకుపై ఒక ఎపిసోడ్ అయితే వేరే లెవెల్లో వర్కవుట్ అయ్యింది.ఇద్దరు ఆడవాళ్ళ నడుమ సాగే డ్రామాని మాంచి క్రేజీ లెవెల్లో వినోదభరితంగా తెరకెక్కించి ఎంటర్టైన్ చేయడం బాగుంది. ఇక దీనితో పాటుగా తన నుంచి ఈ కొంత కాలం మిస్ అయ్యిన కామెడీ మళ్లీ కనిపించింది. అలాగే వెంకీతో పాటుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ల నడుమ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇంకా వెంకీ మామ కొడుకుగా కనిపించిన బాల్య నటుడు మాస్టర్ రేవంత్ సినిమాలో అదరగొట్టేసాడు. తనకి వెంకీ మామ నడుమ సీన్స్ ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. గోదావరి అమ్మాయిగా బ్యూటిఫుల్ గా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, గ్లామరస్ కాప్ గా మీనాక్షి షైన్ అయ్యింది. అలాగే వీరితో పాటుగా శ్రీనివాస్ అవసరాల, వీటివి గణేష్ లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇంకా నరేష్, అనిమల్ ఫేమ్ ఉపేందర్ లిమయే పలు సీన్స్ లో నవ్విస్తారు. ఇంకా సాయి కుమార్ కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇలా నటీనటులు పరంగా మంచి ఎంటర్టైనింగ్ కథనంతో సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.
సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు అనిల్ రావిపూడి సరదాగా సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన గత సినిమాల కంటే ఈ సినిమాలో నిర్మాణ విలువలు చాలా బెటర్ అని చెప్పొచ్చు. తనలోని గొప్ప విషయం ఏమిటంటే ప్రతీ సినిమాకి కొంచెం రెగ్యులర్ లైన్ నే ఎంచుకున్నప్పటికీ దానిని నడిపించే విధానం మాత్రం స్యూర్ షాట్ అన్నట్టు ఉంటుంది. అది ఎలాంటి హీరో విషయంలో అయినా సమానంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే మళ్లీ రిపీట్ అయ్యింది అని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం లో కూడా సాలిడ్ హిళేరియాస్ నరేషన్ తో ఆద్యంతం బోర్ లేకుండా సాగిపోతుంది. ఇలా మళ్లీ కంప్లీట్ ప్యాకేజ్ ఎంటర్టైనర్ గా అయితే అనీల్ మళ్లీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ. కథనంలో భాగమవుతూ సాగే పాటలు ఇప్పటికే హిట్‌గా నిలిచాయి. కథ సారాంశాన్ని ఒడిసిపట్టేలా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఉంటుంది. మంచి కలర్ ఫుల్ గా బాగుంది, ఎడిటింగ్ వర్క్స్ బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంపైనే పూర్తిగా ఫోకస్ పెడుతుంది. అయితే కథ పెద్దగా సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఏం లేకుండా ఊహించేలా సరళంగా సాగుతుంది. కొన్ని పాత్రలకు సరైన స్క్రీన్ టైం లేకపోవడం, భారీ తారాగణాన్ని ఇంకా ఉపయోగించుకొని ఉంటే బాగుండేది. సెకండాఫ్ అద్భుతంగా ఉంది. ఆవకాయ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది. కొన్ని భాగాలు సాగదీతగా అనిపిస్తాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం చివరి 30 నిమిషాలు చాలా చక్కగా హ్యాండిల్ చేయడమే కాకుండా.. మంచి సందేశంతో సినిమాను ముగించాడు. క్లైమాక్స్‌లో వచ్చే వెంకీ మోనోలాగ్ అభిమానులను విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. రొటీన్ రెగ్యులర్ లైన్ ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా సాగే డ్రామా మంచి హిలేరియస్ గా సాగుతోంది. దీనితో ఈ పండుగకు ఫ్యామిలీలతో కలిసి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడొచ్చు.