గ”మ్మత్తు”గా కోట్లకు పడగలెత్తిన సంజన…
ఆమె స్టార్ హీరోయిన్ కాదు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న దాఖలాలూ లేవు. పోనీ పుట్టుకతో సంపన్న కుటుంబమూ కాదు. మరి ఆమెకు అన్ని ఆస్తులెలా వచ్చాయి? ఇదేదో గమ్మత్తుగా ఉందే… అంటూ పోలీసులు, మీడియా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, శాండల్ వుడ్ అని తేడా లేకుండా సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదుపుతోన్న డ్రగ్స్ కేసులో దక్షిణాది నుంచి అరెస్టయిన తొలి నటి సంజన అని తెలిసిందే.
తెలుగులో బుజ్జిగాడు మేడిన్ చెన్నై తప్ప మరే సినిమాలోనూ చెప్పుకోదగ్గ పాత్రలో కనిపించని సంజన…కన్నడంలో కూడా పెద్ద స్టార్ హీరోయిన్ కాదు. అక్కడ చేసినవి కూడా చాలా వరకూ మితిమీరిన గ్లామర్ ఒలకబోసే పాత్రలే. అయినప్పటికీ ఆమె సంపద మాత్రం వీటన్నింటికీ అతీతంగా పెరిగిపోయింది. మూడు రోజుల క్రితం డ్రగ్స్ విచారణలో భాగంగా పొలీసులు సంజన నివాసంపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంజన ఆస్తులు చూసి విచారణ అధికారులు సైతం షాక్ తిన్నట్టు సమాచారం. ఆమెకు కేవలం బెంగుళూర్ నగరంలోనే 10 ఖరీదైన ఫ్లాట్స్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు నోరెళ్లబెట్టారట. ఈ నేపధ్యంలో సంజనకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం.
బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మొండికేసిన సంజన.. ఇదిలా ఉంటే డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైన వైద్యులను సంజన ముప్పు తిప్పలు పెట్టిందని సమాచారం. తనకే మాత్రం సంబంధం లేని కేసులో తనను ఇరికిస్తున్నారని తన పరువు బజారు కెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందట. తన రక్తం తీసుకుని పరీక్షలు చేసినా వాటి రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయని నమ్మకమేంటంటూ ప్రశ్నించిందట. ఇలాగే పలు ప్రశ్నలు వేస్తూ, వాదిస్తూ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వనంటే ఇవ్వనంటూ మొండికేసినట్టు సమాచారం.













