Allu Arjun: అల్లు అర్జున్‌పై తెలంగాణ సర్కార్ పగబట్టిందా..!?
పుష్ప 2 (Puspha 2) సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో (stampede) ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు చావుబతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం.. తెలంగాణలో (Telangana) సంచలనం కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పదిమిందికిపైగా అరెస్టు చేశారు. అందులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఉండడం పెద్ద సంచలనానికి దారితీసింది. అల్లు అర్జున్ ఒకరాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది. అయితే అల్లు అర్జున్ ను అరెస్టు చేయాల్సింది కాదని.. కావాలనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇలా కక్ష సాధిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీన్ని రాజకీయకోణంలో చూడొద్దని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ.
హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టు రిమాండ్ విధించడం.. ఆ వెంటనే బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయి. అయినా బెయిల్ పత్రాలు సరైన సమయానికి జైలు అధికారులకు చేరకపోవడంతో ఆ రాత్రి చంచల్ గూడ జైల్లోనే (Chanchalguda Jail) అల్లు అర్జున్ ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయమే బయటకు వచ్చారు. ఆ రోజంతా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడాన్ని జీర్ణించుకోలేకే తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసిందని కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
అదే సమయంలో తాము సెక్యూరిటీ అడిగామని.. అయినా పోలీసులు తమపైనే నెట్టే ప్రయత్నం చేస్తున్నారని సంధ్య థియేటర్ (Sandhya Theatre) యాజమాన్యం ప్రకటించింది. పర్మిషన్ లెటర్ ను విడుదల చేసింది. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం పర్మిషన్ అడిగినమాట వాస్తవమే అయినా తాము పర్మిషన్ ఇవ్వలేదని.. ఆ విషయాన్ని సంధ్య థియేటర్ యాజమాన్యం కప్పిపుచ్చి నెపాన్ని తమపైకి నెడుతోందని పోలీసులు విమర్శించారు. అంతేకాక.. తొక్కిసలాటకు కారణమై ఓ మహిళ మృతికి కారణమైనందున థియేటర్ ను ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. త్వరలోనే థియేటర్ సీజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అంతేకాదు.. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య పోస్టులు పెట్టిన వారి పైన కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, బాలుడు చావుబతుకుల్లో ఉండడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరిన్ని ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తోంది. అంతేకాక.. ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోయినా రేపు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులకు సూచించారు. విమర్శలకు తావివ్వకుండా చూడాలని స్పష్టం చేశారు. అందుకే పోలీసులు తొక్కిసలాట ఘటనను సీరియస్ గానే టేకప్ చేసినట్లు అర్థమవుతోంది.













