టాలీవుడ్ టాప్ స్టార్ కోసం పాన్ ఇండియా మూవీ కథ రెడీ చేసిన సందీప్!
ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. కొంతమంది డైరెక్టర్లు అవ్వకుండానే అసిస్టెంట్ డైరెక్టర్లుగా, కో డైరెక్టర్లుగా ఉండిపోతారు. కొంతమంది బ్లాక్‌బస్టర్స్ తీసి గొప్ప పేరు తెచ్చుకుంటారు. కొంతమందికి కొన్ని సినిమాలు తీసిన తర్వాత బ్రేక్ వస్తుంది. మరికొందరికి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకుంటారు. అలాంటివారిలో సందీప్ వంగా ఒకరు. అంతకుముందు కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన సందీప్ `అర్జున్‌రెడ్డి`తో డైరెక్టర్‌గా మారి తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చి విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చెయ్యడమే కాకుండా తను కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా తర్వాత వెంటనే మహేష్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేస్తాడని అందరూ అనుకున్నారు.
దానికి తగ్గట్టుగానే వారి కోసం కథలు కూడా రెడీ చేశాడని వార్తలు వచ్చాయి. ఈలోగా `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే అవకాశం వచ్చింది. షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా `కబీర్‌సింగ్` పేరుతో రూపొందిన ఈ సినిమా అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. షాహిద్ కపూర్ కెరీర్లో ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో అతని మార్కెట్ కూడా బాగా పెరిగింది. ఆ సినిమా తర్వాత సందీప్ ఏ సినిమా చేస్తాడా అని అటు బాలీవుడ్ వర్గాలు, ఇటు టాలీవుడ్ వర్గాలు ఎదురుచూశాయి. అయితే పైనల్గా బాలీవుడ్లోనే తన తదుపరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సందీప్. ప్రాజెక్ట్ అంతా సెట్ చేసుకొని షూటింగ్‌కి వెళ్లబోతున్న తరుణంలో కరోనా వచ్చి పడడం, లాక్డౌన్ విధించడం జరిగిపోయింది. దాంతో బాలీవుడ్ సినిమా ఆగిపోయింది. ఐదు నెలలుగా ఉన్న లాక్డౌన్ వల్ల ఖాళీగా ఉన్న సందీప్ ఒక స్టార్ హీరో కోసం భారీ స్థాయిలో ఉండే ఓ కథను రెడీ చేశాడు. ఒక విధంగా ఇది పాన్ ఇండియా మూవీ కథ అని చెప్పొచ్చు. అయితే ఈ కథను ఎవరి కోసం రెడీ చేశాడన్నది తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని, త్వరలోనే ఆ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.













