కలర్ ఫోటో డైరెక్టర్ తో రవితేజ
హిట్టూ ఫ్లాపులతో లింక్ పెట్టుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో రవితేజ ఒకడు. రాజా ది గ్రేట్ కు ముందు ఏదో అనుకోకుండా ఓ ఏడాది గ్యాప్ వచ్చిందంతే. అది కాకుండా ఎప్పుడైనా సరే రవితేజ కెరీర్ లో ఏడాదికి మినిమం రెండు రిలీజ్ లు ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుంటాడు రవితేజ.
గతేడాది క్రాక్, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ, ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు రవితేజ. దీని తర్వాత రవితేజ ఎవరితో సినిమా చేయనున్నాడనే దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.
డైరెక్టర్ల ట్రాక్ రికార్డులతో పని లేకుండా సినిమాలు చేసే రవితేజ తన తర్వాతి సినిమా విషయంలో కూడా ఇలాంటి డెసిషనే తీసుకున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటో లాంటి సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన సందీప్ రాజ్ తో రవి తేజ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కలర్ ఫోటో తర్వాత ఇప్పటి వరకు సందీప్ ఎలాంటి సినిమా తీసింది లేదు.
హెడ్స్ అండ్ టేల్స్ అనే వెబ్ సిరీస్కు క్రియేటర్ గా వ్యవహరించాడు. ముఖచిత్రం అనే సినిమాకు స్క్రిప్ట్ ఇచ్చాడు. ఈ రెండింటికి అనుకున్నంత మంచి పేరేమీ రాలేదు. కానీ ఈ సారి సందీప్ రవితేజను మెప్పించే స్టోరీ రెడీ చేసినట్లు టాక్. ఇందులో రవితేజ మిడిల్ ఏజ్డ్ లెక్చరర్ క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. వినోదానికి పెద్ద పీట వేసేలా ఈ స్క్రిప్ట్ ను సందీప్ రెడీ చేశాడని, సినిమా మంచి ఎంటర్టైనర్ అయ్యే ఛాన్సుందని చెప్తున్నారు సన్నిహితులు.













