సిటాడెల్ రిలీజ్ ఎప్పుడంటే..!
టాలీవుడ్ లో సమంత పదేళ్లకు పైగా స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగింది. ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత ఆ తర్వాత వరుస అవకాశాలందుకుని అగ్ర హీరోయిన్ గా చలామణి అయింది. అయితే పెళ్లి, విడాకులు ఆ తర్వాత అనారోగ్యం కారణంతో ఆమె కెరీర్ స్లో అయింది.
ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ కోసం సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకున్న సమంతకు ఆ తర్వాత అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మొన్నామధ్య తన పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్ లో సినిమాను అనౌన్స్ చేసింది కానీ ఇంకా అది సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో సమంత మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.
సమంత వెండితెర రీఎంట్రీ కంటే ముందు వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చేట్లు సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ ధావన్ తో కలిసి సమంత చేసిన సిటాడెల్ హన్నీ బన్నీ త్వరలోనే విడుదల కానుంది. రాజ్-డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ కు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. రాజ్-డీకే ట్విట్టర్ లో 01.08 అని ఉన్న పోస్టర్ ను షేర్ చేసి దానికి క్యాప్షన్ గా తేనె డబ్బా, కుందేలు బొమ్మలున్న ఎమోజీను పోస్ట్ చేశారు. ఇవి సిటాడెల్ లో లీడ్ రోల్స్ అయిన హనీ, బన్నీలకు సైన్స్ అని అర్థమవుతుంది. రాజ్-డీకే ట్విట్టర్ పోస్ట్ ను బట్టి ఆగస్ట్ 1న సిటాడెల్ రిలీజ్ కానుందని ఆమె ఫ్యాన్స్ ఓ నిర్ణయానికొచ్చేశారు. త్వరలోనే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది.













