నాగచైతన్య, సమంత జంటగా మరో సినిమా రాబోతోందా?
టాలీవుడ్లో `ఏమాయ చేసావె` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన సమంత ఆ సినిమాలోని తన హీరో నాగచైతన్యనే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే సెటిలైపోయింది. పెళ్లికి ముందుకు ఇద్దరూ కలిసి ఓ నాలుగైదు సినిమాలు చేసినా పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ కలిసి నటిస్తున్నారంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీని అందరికీ కలిగించిన సినిమా `మజిలీ`. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశం తక్కువని సినీ వర్గాల్లో ఓ అభిప్రాయం ఉంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఈ జంట కలిసి నటించిన ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఆ సినిమా తర్వాత సమంత చేసిన `ఓ బేబి` మంచి విజయం సాధించింది. కానీ, ఎన్నో అంచనాల మధ్య విడుదలైన `జాను` పరాజయాన్ని చవిచూసింది. తమిళ్లో సూపర్‌హిట్ అయిన `96` రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఆ సినిమా తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత మరో సినిమా చేయడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యతో కలిసి మరోసారి సమంత నటిస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాలో నాగచైతన్య అతిథి పాత్రలోనే కనిపిస్తాడట. సమంత, నందినిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన `ఓ బేబీ` చిత్రంలో కూడా నాగచైతన్య ఓ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.













