సలార్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ రిస్క్
ఈ సంవత్సరం ఎక్కువ అంచనాలతో రానున్న సినిమా అంటే సలార్ సినిమానే. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో సలార్ పై అమితమైన అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రీసెంట్గా సలార్ టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ విషయంలో అనుకున్న రెస్పాన్స్ అయితే రాలేదు.
టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సినిమాపై అంచనాలేమీ తగ్గవు. రిలీజ్ టైమ్ కు సినిమాకు హైప్ పెరగడం ఖాయం. ఆదిపురుష్ విషయంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఋజువైంది. ట్రేడ్ వర్గాల్లో కూడా సలార్ సినిమాకు మామూలు హైప్ లేదు. ఈ క్రేజ్ ను చూసుకునే బిజినెస్‌ను ఆకాశానికెత్తేస్తుంది నిర్మాణ సంస్థ.
కేజీఎఫ్ రెండు పార్టులుగా రావడంతో ఊహించని లాభాలను అందుకున్న హోంబలే ఫిల్మ్స్, ఈ సినిమాను కూడా బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. కేవలం థియేట్రికల్ రైట్స్ తోనే రూ.600 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారట నిర్మాతలు. కేవలం తెలుగు రాష్ట్రాలకే రూ.200 కోట్లని చాలా కచ్ఛితంగా చెప్తున్నారట.
నైజాంకు రూ.80 కోట్లు, ఆంధ్రా రాయలసీమ కలిపి రూ.120 కోట్లు రేట్లు చెప్తున్నారట. అంటే డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్స్ రావాలంటే సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ రాబట్టాలి. కేవలం ప్రభాస్ ఒక్కడికి అది చాలా భారమనే చెప్పాలి. సలార్ కు అన్నీ బాగుండి పాజిటివ్ టాక్ వస్తే బానే ఉంటుంది కానీ ఒకవేళ రిజల్ట్ లో తేడా వస్తే మాత్రం సినిమాను కొన్న వాళ్లు ఘోరంగా నష్టపోవాల్సి ఉంటుంది.













