పాతికేళ్ల తర్వాత సంజయ్ రీఎంట్రీ?
బాలీవుడ్ లో హీరోగానే కాకుండా విలన్, కీలక పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్, దక్షిణాదిలో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. కేజీఎఫ్2లో అధీర క్యారెక్టర్ లో సంజయ్ దత్ ఏ రకంగా భయపెట్టాడో తెలిసిందే. ఇప్పుడు విజయ్ నటిస్తున్న లియో సినిమాలో కూడా సంజయ్ దత్ కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే సంజయ్ దత్ పాతికేళ్ల ముందే తెలుగులో చంద్రలేఖ అనే సినిమాలో గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంజయ్ దత్ ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సంజయ్ దత్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
రామ్ హీరోగా పూరీ తీస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ కోసం పూరీ ఓ బలమైన క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట. ఈ వార్త నిజమై సంజయ్ దత్ ఈ సినిమాలోకి అడుగుపెడితే డబుల్ ఇస్మార్ట్ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.













