ప్రభాస్ సినిమాలపై బాలీవుడ్లో పెరుగుతున్న ఆసక్తి.. ప్రతి వార్తా వైరలే!
ఒక టాప్ హీరోకి సంబంధించిన కొత్త సినిమా ఎనౌన్స్ అయిన వెంటనే ఆ సినిమాకి సంబంధించిన రకరకాల ఊహాగానాలు రావడం సర్వసాధారణం. అయితే అది ఈమధ్యకాలంలో ఎక్కువైందని చెప్పాలి. ఎందుకంటే మీడియా పెరగడం, సోషల్ మీడియాలో యాక్టివిటీస్ పెరగడంతో ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పడు ప్రభాస్ లేటెస్ట్ మూవీ `ఆదిపురుష్` విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడని కొందరు అంటుంటే, సీత పాత్ర కోసం అనుష్కను తీసుకోవాల్సిందేనని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందో మరికొందరు సజెస్ట్ చేస్తున్నారు.
2020 ప్రారంభంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన `తన్హాజీ` చిత్రంతో బాగా పాపులర్ అయిన ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందే `ఆదిపురుష్` చిత్రం 2021లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. 2022లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరోపక్క ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ను ఎంపిక చేయబో్తున్నారని కొందరంటుంటే, మరికొందరు కీర్తి సురేష్ హీరోయిన్గా ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అయితే ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని, ఈ సినిమాకి సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనల్ చెయ్యలేదని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రే ఎక్కువగా ఉంటుందని. హనుమంతుడు లంకకు వెళ్లడం నుంచి రావణ సంహారం వరకు ఎక్కువ భాగం ఉంటుందట. ప్రభాస్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందని, అది కూడా గ్రాఫిక్స్‌లో ప్రభాస్ తెరపై కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమాత్రం దానికి చిత్ర యూనిట్ ఎందుకంత హడావిడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సంవత్సరం చివరలో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు టాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల హీరోగా ప్రభాస్ పేరు మారుమోగిపోతోంది. అలాగే బాలీవుడ్ ప్రముఖుల్లో సైతం ప్రభాస్ కొత్త సినిమాల విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













