అలాంటి పాత్రలకే ఓటేస్తున్న సాయి పల్లవి
అందానికి అందం, నటనకు నటన ఉండబట్టే సాయి పల్లవికి అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ ఎంతగా ఉన్నప్పటికీ కథ బాగా నచ్చి అందులో తన పాత్రకు నటనా ప్రాధాన్యత ఉంటే తప్ప అమ్మడు సినిమాను ఓకే చేయదు. డ్యాన్సుల్లో తాను ఎంతగానో అభిమానించే చిరంజీవికి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటించమని అడిగితే ఆ సినిమా రీమేక్ అనే రీజన్ తో నో చెప్పేసింది.
దీన్ని బట్టి చూస్తుంటే సాయి పల్లవి ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ఒక క్లారిటీ పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం అమ్మడు లైనప్ చూస్తుంటే ఎమోషనల్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. తండేల్ సినిమాలో స్నేహితుల కోసం శత్రు దేశమైన పాకిస్థాన్ కు వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడి కోసం పోరాటం చేసే యువతిగా సాయి పల్లవి కనిపించనుంది.
ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను డైరెక్టర్ చందూ మొండేటి ఎంతో బాగా డిజైన్ చేశాడట. ఇక శివ కార్తికేయన్ చేస్తున్న సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా సాయి పల్లవి కనిపించనుందట. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో నటిస్తున్న చిత్రంలో కూడా లవ్ ఎమోషన్స్ భారీగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి సాయి పల్లవి ఒప్పుకుంది ఈ మూడు సినిమాలే. ఈ మూడింటిలోనూ సాయి పల్లవి పాత్రలు చాలా ఎమోషనల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.













