మౌనం పాటిస్తున్న సాయిపల్లవి …
టాలీవుడ్ లో హై టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయిపల్లవి ఒకరు. ‘ఫిదా’ మూవీతో తొలి ఎంట్రీ తోనే ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. తనదైన మార్కు పాత్రలతో ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తూ తెలుగు, తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సాయి పల్లవి తన క్రేజ్ కి తగ్గ సక్సెస్ లని సొంతం చేసుకోలేకపోతుంది.
2021 లో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. నాగ చైతన్య తో “లవ్ స్టోరీ”, న్యాచురల్ స్టార్ నానితో “శ్యామ్ సింగరాయ్” చిత్రాలతో విజయం సాధించారు. అయితే 2022 మాత్రం సాయి పల్లవికి కలిసి రాలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో రానాతో కలిసి తీసిన “విరాట పర్వం” నిరాశపరిచింది. “గార్గి” తమిళ్,తెలుగు భాషలలో ఒకేసారి రిలీజయ్యి ప్రేక్షకుల ప్రశంశలని అందుకుందే కానీ విజయాన్ని సాధించలేకపోయింది.
ఈ రెండు సినిమాలు రిలీజయ్యి నెలలు గడుస్తున్నా సాయి పల్లవి మరొక సినిమాకి సైన్ చేయలేదు. ఈ సందర్భంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి సినిమాలకి గుడ్ బాయ్ చెప్పబోతుందని , అందుకే ఇంకా తన తదుపరి సినిమాని అంగీకరించలేదని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
త్వరలో ఒక హాస్పిటల్ ని ప్రారంభించబోతుందని, ఆ ఏర్పాట్లలో బిజీగా ఉందని సన్నిహితుల సమాచారం. ఇదిలా ఉంటే, సాయి పల్లవి బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతుందని అందుకే తెలుగు, తమిళంలో ఏ సినిమాని ఇంకా ఫైనలైజ్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై సాయి పల్లవి కానీ, తన టీమ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. సామ్ విషయంలో వచ్చే రూమర్స్ ని తన సన్నిహితులు ఎప్పటికప్పుడు ఖండించడం చూస్తూనే ఉన్నాం. కానీ సాయి పల్లవి విషయంలో మాత్రం తను కానీ తన సన్నిహితులు కానీ స్పందించకపోవడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలెందుకు సాయి పల్లవి మౌనం పాటిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.













