Sai Durga Tej: తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సాయి దుర్గ తేజ్
సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి చెప్పకనే చెప్పినట్టుగా కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన తరువాత సాయి దుర్గ తేజ్ మరో జన్మను ఎత్తినట్టుగా ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్నారు. అందరికీ రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ప్రాధాన్యాన్ని కూడా చెబుతుంటారు. తాజాగా సాయి దుర్గ తేజ్ తనకు వచ్చిన అవార్డు, ఆ అవార్డుని అమ్మ విజయ దుర్గ గారి చేతుల మీదుగా అందుకోవడం గురించి పోస్ట్ వేశారు.
పిల్లా నువ్వులేని జీవితం సినిమాకి గాను డెబ్యూ హీరోగా సినీ మా అవార్డును సాధించారు. అయితే ఆ మొదటి అవార్డుని తల్లి చేతుల మీదుగా సాయి దుర్గ తేజ్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ పునర్జన్మలో మొదటి అవార్డుని కూడా తల్లి చేతుల మీదుగానే సాయి దుర్గ తేజ్ తీసుకున్నారు. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025లో మోస్ట్ డిజైరబుల్ స్టార్ (మేల్) అవార్డుని తీసుకున్న క్షణాల గురించి సాయి దుర్గ తేజ్ ఎమోషనల్‌గా స్పందించారు.
‘నా మొదటి జీవితంలో మొదటి అవార్డుని అమ్మ చేతుల మీదుగా తీసుకున్నాను.. నా పునర్జన్మలో మళ్లీ నా మొదటి అవార్డుని అమ్మ చేతుల మీదుగానే తీసుకున్నాను.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు.. నీకు కొడుకుగా పుట్టాను అమ్మా’ అంటూ సాయి దుర్గ తేజ్ తన మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్నారు.
సాయి దుర్ఘ తేజ్ ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తీస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘SYG: సంబరాల ఏటి గట్టు’తో అందరినీ మెప్పించబోతోన్నారు. ఈ చిత్రం కోసం సాయి దుర్గ తేజ్ తన శరీరాకృతిని మార్చుకున్న తీరు ఇప్పటికే అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది. ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ట్రేడ్ సర్కిల్స్‌లో బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.






