Traffic Summit: బైక్, కారు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ లో సాయి దుర్గ తేజ్

ప్రజల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ (Traffic Summit)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా…
హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ ట్రాఫిక్ మీట్‌కు రావటం వెనుక నా వ్యక్తిగత కారణం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 10, 2021లో నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను రెండు వారాల పాటు కోమాలో ఉన్నాను. ఇది అందరికీ సానుభూతి కోసం చెప్పటం లేదు. అందరికీ తెలియాలని చెబుతున్నాను. ఆ రోజు నేను ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలతో బయటపడటానికి ప్రధాన కారణం..తలకు హెల్మెట్‌ను ధరించటమే. అందువల్లనే నేనీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి బైక్ తోలే ప్రతీ ఒక్కరికీ హెల్మెట్ తప్పకుండా ధరించమని రిక్వెస్ట్ చేస్తున్నాను.
బండి నడిపే ప్రతీ ఒక్కరి కుటుంబ సభ్యుడు, భాగస్వామి తప్పకుండా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలి. యాక్సిడెంట్ తర్వాత నా వాయిస్ పోయింది.. చాలా విషయాలు మరచిపోయాను. జీవితంపై ఆశను వదులుకున్నాను. బైక్స్‌ను వేగంగా నడపకండి. అందరికీ అద్భుతమైన జీవితం ఉంది. అందరూ నవ్వుతూ జీవించాలి. మీరు ప్రేమించేవాళ్లు నవ్వుతూ ఉండాలంటే మీరు బైక్ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కారు నడిపేవాళ్లు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సీట్ బెల్ట్స్ ధరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. రూల్స్ పాటించటం వల్ల మీకే కాదు.. మీతో, ఎదురుగా ఉండే తోటి ప్రయాణీకులకు కూడా మంచిది.
నేను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు బైక్ నుంచి కిందపడటం మాత్రమే గుర్తుంది. తర్వాత హాస్పిటల్‌లో కళ్లు తెరవటం మాత్రమే గుర్తుంది. ప్రమాదం తర్వాత నాకు బైక్ రైడింగ్ అంటే భయం వచ్చింది. అయితే బైక్ తాళాలను నా చేతికిస్తూ మా అమ్మ ఒక మాట చెప్పింది. ‘నా కొడుకు బైక్ రైడింగ్ అంటే భయపడాలని, భయంతోనే బతకాలని నేను కోరుకోవటం లేదు. నువ్వు ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో బైక్‌ను నడిపి ధైర్యం వచ్చిన తర్వాతే రోడ్డు పైకి వెళ్లు’ అని చెప్పింది. ఆమె చెప్పినట్లు ఇప్పుడు నేను ప్రతీ వారం ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో బైక్‌ను నడుపుతున్నాను, అది కూడా హెల్మెట్ ధరించి మాత్రమే.
ఇప్పటికింకా నేను రికవరీ అవుతున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మాట్లాడటాన్ని మరచిపోయాను. సెన్సిటివ్ బ్యాలెన్స్ లేకుండా పోయింది. పెన్ ఎలా పట్టుకోవాలో కూడా మరచిపోయాను. ఓ వాక్యాన్ని రాయటం కూడా తెలియలేదు. ఈ స్టేజ్‌కు రావటానికి చాలా సమయం పట్టింది. ఇంకా రోడ్‌పైకి డ్రైవ్‌కి వెళ్లటానికి సమయం పడుతుంది. నేను తాగను. సాధారణంగా మా స్నేహితులు పార్టీ చేసుకున్నప్పుడు కూడా నేను వాళ్లని సేఫ్‌గా ఇంటికి తీసుకెళ్లటానికి నన్నే పిలిచేవాళ్లు.
నా తోటి స్టార్ హీరోలను కూడా సినిమాల్లో నటించేటప్పుడు కూడా హెల్మెట్స్ ధరించి స్టంట్స్ చేయమని చెబుతాను. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను గమనిస్తే.. ఆయన సినిమా స్టంట్స్ చేసే సమయంలోనూ హెల్మెట్ ధరించే కనిపిస్తారు. నేను సినిమాల్లో నటించాలని అనుకున్నప్పుడు ప్రతీ సినిమా ఆఫీసుకి వెళ్లి ఫొటోలను ఇచ్చి సినిమాల్లో అవకాశం ఉంటే చెప్పమని రిక్వెస్ట్స్ చేసేవాడిని. ఆ సమయంలో బైక్‌లో ట్రావెల్ చేసేవాడిని. కొన్ని ఆఫీసుల్లో నా ఫొటోలను పడేయటాన్ని కూడా చూశాను. కొన్నిసార్లైతే నా ఫొటోలను అలా పక్కన పడేయకండి, నాకు ఇవ్వండి నేను వేరే ఆఫీసులకు ఇచ్చుకుంటాను అని అడిగి వెనక్కి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
నేను నా మావయ్య(చిరంజీవి, పవన్ కళ్యాణ్) లను వెనక ఎక్కించుకుని ఎప్పుడూ డ్రైవ్ చేయలేదు. ఆ అవకాశం రాలేదు. పవన్ కళ్యాణ్‌గారికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన బైక్ రైడింగ్ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. టాఫిక్ పోలీసులు మనం గుర్తించని హీరోలనే చెప్పాలి. ఇంట్లో మనం భయం లేకుండా ఉంటున్నామంటే అందుకు కారణం అమ్మ, నాన్న, అక్క..అలా కుటుంబ సభ్యులే. కానీ.. మనం బయటకు ధైర్యంగా వెళుతున్నామంటే కారణం పోలీసులే. వారికి సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్లు మనకు భయం లేకుండా ఉండేలా ధైర్యాన్ని కలిగిస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా పోలీస్ ఉంటే ఆ ధైర్యమే వేరు. మనకు తెలియకుండానే పోలీసులు మన జీవితాల్లో భాగమైపోయారు. పోలీసులు ఎంతో సమయాన్ని మన కోసం వెచ్చిస్తుంటారు. అలాంటి వాళ్లు బావుండాలని మనం ఎప్పుడూ కోరుకోవాలి. మా తాతగారు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారే.
నేను ఇన్నేళ్లలో ఒకట్రెండు సార్లు మాత్రమే.. అత్యవసరమైన ట్రాఫిక్ సిగ్నల్స్ దాటాను. సాధారణంగా నేను రూల్స్‌ను ఫాలో అవుతుంటాను. టి హబ్ దగ్గర బైక్ రేసింగ్స్ జరుగుతుంటాయని విన్నాను. నిజానికి నేను అక్కడకు దగ్గరగానే ఉంటాను కానీ.. నేనెప్పుడూ వాటిని గమనించలేదు. నేను బైక్‌ను రేసింగ్స్‌కు వెళ్లేంత వేగంగా నడపను. ఎందుకంటే అమ్మకు సమాధానం చెప్పాలి.. అలాగే తమ్ముడున్నాడు వాడికి సమాధానం చెప్పాలి. నేను అందరికీ చెప్పాలనుకున్న విషయం ఒకటే. మన జీవితానికి మనమే బాధ్యులం. ఎవరూ బాధ్యత వహించరు. తప్పు చేస్తే మనల్నే తిడతారు.
నేను పోలీసులను ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే.. సాధారణంగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపేవారిని, తాగి బండి నడిపేవారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చైనా, ఫైన్ వేసైనా వదిలేస్తారు. కానీ అలా కాకుండా ఇంకా ఏదైనా బెటర్‌గా చేస్తే బావుంటుంది. మామూలుగా పిల్లాడు హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడతాడనే భయంతో హోంవర్క్ చేస్తాడు. అలాగే హెల్మెట్ ధరించని వాళ్లకి, తాగి బండి నడిపేవాళ్లకి చిన్న పనిష్‌మెంట్ ఇస్తే బావుంటుంది. ఏది మంచిదో పోలీసులు ఆలోచించాలని కోరుకుంటున్నాను. అలా చేస్తే జీవితాలపై మరింత బాధ్యత పెరుగుతుంది. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే’’ అన్నారు.