ఇంతకీ గాంజా శంకర్ ఉన్నట్టా? లేనట్టా?
విరూపాక్షతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న సాయి ధరమ్ తేజ్, రీసెంట్ గా తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. బ్రో సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న తేజ్, ఆ తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుని కొన్నాళ్ల పాటూ సినిమాల నుంచి విరామం తీసుకున్నాడు. బ్రేక్ తీసుకున్న తర్వాత తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు.
అయితే ఈ సినిమా ఆగిపోయిందని గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సత్య షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో గాంజా శంకర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా క్యాన్సిలైందనే వార్త మీడియాలో చూసి తెలసుకున్నా తప్పించి నిజంగా ఉందో లేదో అన్నది మీరే చెప్పాలని జర్నలిస్టులను తిరిగి ప్రశ్నించాడు తేజ్.
స్వయంగా హీరోనే ఇలా ప్రశ్నించడంతో కొత్త సందేహాలు వస్తున్నాయి. నిజంగా సినిమా కొనసాగిస్తుంటే హీరోగా నేనే చెప్తున్నా అవన్నీ పుకార్లని ఒక్క మాట చెప్తే సరిపోయేది. కానీ మీకే తెలుసు అని తేజ్ అలా అనడంతో ఇప్పుడు అనుమానాలు పెరిగాయి. మరోవైపు నిర్మాణ సంస్థ కూడా ఈ విషయంలో అసలు రెస్పాండ్ అవడం లేదు. ఏదైనా ఈ విషయంలో నిర్మాణ సంస్థనో, హీరోనో స్పందించే వరకు ఈ గందరగోళం తప్పేలా లేదు.













