తేజూ టైమ్ స్టార్ట్ అయినట్లే..
సినిమా రంగంలో సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి, ఇక్కడ సక్సెస్ కు ఇచ్చే వాల్యూ ఎక్కువ. ఒక నటుడు, టెక్నీషియన్, ఇలా ఎవరి విషయంలో అయినా ముందురోజు వరకు అసలు పట్టించుకోని వాళ్ళు కూడా సక్సెస్ రాగానే ఆ వ్యక్తి చుట్టూ ముడతారు. శుక్రవారం సినిమా రిజల్ట్ ని బట్టి సాయంత్రానికి ఆ సినిమాలో ఉన్న వాళ్ల జాతకాలు మారిపోతుంటాయి.
ఇలా రాత్రికి రాత్రి జీవితాలు మారిపోయిన వాళ్లు చాలా మందే కనిపిస్తారు సినీ పరిశ్రమలో. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో ఇదే జరిగింది. పది రోజుల ముందు వరకు తేజూ సిట్యుయేషన్ వేరు. తన చివరి సినిమా రిపబ్లిక్ పెద్ద డిజాస్టర్ అయింది. అంతకుముందు సోలో బ్రతుకే సో బెటర్ కూడా సరిగా ఆడలేదు. దీనికి తోడు రోడ్ యాక్సిడెంట్ వల్ల తేజూ బాగా డల్ అయిపోయాడు. ప్రమాదం నుంచి కోలుకుని బయటికి వచ్చి సినిమా తీసినా, మునుపటి ఉత్సాహం లేదు తేజూలో. వోకల్ కార్డ్స్ కొంచెం దెబ్బ తిని మాట కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది.
విరూపాక్ష సినిమా షూట్లో తను చాలా ఇబ్బంది పడ్డట్లు ఇండస్ట్రీలో డిస్కషన్ జరిగింది. విరూపాక్ష రిలీజ్ కు ముందు ఊహించిన బజ్ కూడా కనిపించలేదు. ఒకప్పుడు తేజూ సినిమాలకు మార్నింగ్ షో లకు ఫుల్స్ పడేవి. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. కానీ విరూపాక్ష పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ఫస్ట్ డే ఈవెనింగ్ నుంచి హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లడం, నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్లడంతో మొత్తం స్టోరీ మారిపోయింది.
తేజూ పట్ల అందరిలోనూ మంచి అభిప్రాయం వచ్చింది. దీంతో తేజూ క్రేజ్ మునుపటి రేంజ్కి చేరుకుంది. ఇప్పుడు తేజూ డేట్ల కోసం నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. తనకు కథలు చెప్పడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. కానీ తేజూ తొందరపడకుండా, ఇంతకుముందులా తప్పులు చేయకుండా, ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం మంచిదని తన సన్నిహితులు, ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తేజూ తన తర్వాతి సినిమాను సంపత్ నందితో చేయనున్న విషయం తెలిసిందే.













