సాహోకు గుమ్మడికాయ కొట్టేశారు
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సాహో సినిమాకు ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేశారు. సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చిత్రబృందంతో కలిసి సెల్ఫీ దిగారు. అంతేకాదు పార్టీ కూడా చేసుకున్నారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా పలువురు టెక్నీషియన్లతో కలిసి ప్రభాస్ దిగిన ఫొటోలు సోషల్‌మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి. 2017 జూన్ 9న సాహో చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. సుజిత్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముకేశ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ఇటీవల సినిమాలోని సైకో సయ్యా అనే తొలి పాటను విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.













