చిరంజీవి సినిమా స్టార్ట్ అవ్వకముందే పెళ్లికి రెడీ అవుతున్న డైరెక్టర్
కెరీర్‌ను ఎప్పుడో స్టార్ట్ చేసి ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తూ పెళ్లి ఊసెత్తని కొంతమంది టాలీవుడ్ హీరోలు ఇప్పుడు వరసగా పెళ్లికి సిద్ధమవుతున్నారు. హీరోలు నితిన్, ప్రభాస్ ఇద్దరూ ఒకే సంవత్సరంలో తమ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. కానీ, ఇప్పటివరకు ప్రభాస్ తన పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. ఇక నితిన్ ఈమధ్యే తన పెళ్లి విషయాన్ని ప్రకటించడం, ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగిపోయింది. లాక్డౌన్ కారణంగా పెళ్లిని వాయిదా వేసుకొని అన్ని పరిస్థితులు చక్కబడ్డాక బంధుమితులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా తన పెళ్లి జరగాలని ఆశపడుతున్నాడు నితిన్. మరో హీరో నిఖిల్ నిశ్చితార్థం ఎప్పుడో జరిగింది. పెళ్లి తేదీ ఫిక్స్ చేసిన తర్వాత లాక్డౌన్ వల్ల రెండు సార్లు వాయిదా పడింది. ఇటీవల హీరో నిఖిల్ పెళ్లి బంధు మిత్రుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది.
`బాహుబలి`తో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న రానా దగ్గుబాటి కూడా పెళ్లికి రెడీ అయ్యాడు. మిహికా బజాజ్‌తో రానా వివాహం జరగనుంది. ఈమధ్యే బంధువుల సమక్షంలో రోకా వేడుకను నిర్వహించారు. ఆగస్ట్‌లో రానా, మిహికాల పెళ్లిని ఘనంగా జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. మూడు రోజులపాటు వీరి పెళ్లి వేడుక జరుగుతుందట.
ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. శర్వానంద్ హీరోగా `రన్ రాజా రన్` చిత్రాన్నితెరకెక్కించి మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ను అందుకున్న దర్శకుడు సుజిత్. తన రెండో సినిమా `సాహో`తో పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ అయిపోయాడు. `బాహుబలి`తో హీరోగా వరల్డ్‌వైడ్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్‌తో `సాహో` వంటి భారీ బడ్జెట్ మూవీని రూపొందించాడు. ఇప్పటివరకు టాలీవుడ్లో ఇదే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా చెప్పకోవచ్చు. తన మూడో సినిమాను
మెగాస్టార్ చిరంజీవితో తీసేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందిన `లూసిఫర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే బాధ్యతను సుజిత్‌కు అప్పగించారు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై తెరకెక్కే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే పెళ్లి చేసుకోవాలని సుజిత్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కి చెందిన డెంటల్ డాక్టర్ ప్రవల్లికను సుజిత్ వివాహం చేసుకోబోతున్నాడు. వారం రోజుల్లో సుజిత్, ప్రవల్లికల ఎంగేజ్మెంట్ జరుగుతుందని సమాచారం.













