నాగార్జున ఆ క్రెడిట్‌ను ఎవరికిస్తాడో?
గత కొంతకాలంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు సరైన హిట్ పడలేదు. ది ఘోస్ట్ తర్వాత ఎంతో టైమ్ తీసుకుని నాగ్ చేస్తున్న సినిమా నా సామిరంగ. నాగ్ కెరీర్ లో 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను త్వరగా ఫినిష్ చేసి, సంక్రాంతి బరిలో నిలపాలని నాగ్ ప్రయత్నిస్తున్నాడు.
దీని తర్వాత నాగ్ తన 100వ సినిమాను చేయనున్నాడు. మరి నాగ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా రానున్న ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ పీరియాడికల్ మూవీలో నాగ్ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం, ధనుష్ మూవీలో నాగ్ ది క్యామియో రోల్ కాదని, శేఖర్ కమ్ముల దాన్ని మల్టీస్టారర్ గా తీర్చిదిద్దబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది తెలీదు కానీ నెక్ట్స్ మాత్రం రావడం ఖాయం. ఇదిలా ఉంటే మరో వైపు అనిల్ అనే తమిళ డైరెక్టర్ కు కూడా నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
జ్ఞానవేల్ రాజా నిర్మాతగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారని అంటున్నారు. రొమాన్స్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్తే ధనుష్ సినిమా లేటయ్యే ఛాన్స్ ఉంది. మరి నాగ్ 100వ సినిమా క్రెడిట్‌ను అనౌన్స్మెంట్ ప్రకారం ఇస్తారా లేదా రిలీజ్ ను బట్టి ఇస్తారా అన్నది చూడాలి.













