ఆ బ్యానర్లో రోషన్ సినిమా
శ్రీకాంత్ కొడుకుగా వెండితెరకు పరిచయమైన రోషన్ కెరీర్ ఇప్పటికీ రసవత్తరంగా కొనసాగట్లేదు. నిర్మలా కాన్వెంట్ తో కెరీర్ ను మొదలుపెట్టిన రోషన్, తర్వాత పెళ్లి సందడి చేశాడు. ఆ సినిమా తర్వాత రోషన్ బిజీ అయిపోతాడనుకుంటే, అదేమీ కనపడట్లేదు. హీరో మెటీరియల్ అయినప్పటికీ రోషన్ కెరీర్ మాత్రం నత్త నడకనే సాగుతుంది.
తనకంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు, ఎలాంటి బ్యాకెండ్ సపోర్ట్ లేని వాళ్లు కూడా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతుంటే రోషన్ మాత్రం ఇంకా మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్నాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో రోషన్ కు ఓ బంపరాఫర్ దక్కింది. మోహన్‌లాల్ నటిస్తున్న మలయాళ సినిమా వృషభలో రోషన్ ఓ కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయ్యాడు.
అది తప్ప రోషన్ చేతిలో మరో సినిమా లేదనుకుంటున్న తరుణంలో తన తండ్రి శ్రీకాంత్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌లో రోషన్ ఓ సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు. వైజయంతీ మూవీస్ లో సినిమా ఛాన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. రోషన్ ప్రస్తుతం చేస్తున్న వృషభ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు శ్రీకాంత్ తెలిపాడు.













