‘రొమాంటిక్’గా ఓటీటీ వైపు దృష్టి సారిస్తున్న ఆకాష్ పూరి!
2007లో రామ్‌చరణ్ హీరోగా పరిచయమైన `చిరుత` చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ ఆ తర్వాత బుజ్జిగాడు, లోటస్‌పాండ్, బిజినెస్‌మేన్, ధోని వంటి సినిమాల్లోనూ బాలనటుడిగా కనిపించి అందర్నీ మెప్పించాడు. ఆ తర్వత ఆంధ్రాపోరి అనే సినిమాతో టీనేజ్ యంగ్ హీరోగా పరిచయమైనా ఆ సినిమా ఆకాష్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇక తన కొడుకుని హీరోగా నిలబెట్టాల్సిన బాధ్యతను తనపైనే వేసుకున్న పూరి అతన్ని హీరోగా పెట్టి మెహబూబా అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ, ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. తాజాగా రొమాంటిక్ అనే ఓ యూత్‌ఫుల్ మూవీతో ఆకాష్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తుండగా కేతికాశర్మ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే లాక్డౌన్ మొదలైంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈమధ్యనే తిరిగి షూటింగ్ ప్రారంభించిన చిత్ర యూనిట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు థియేటర్లు త్వరలోనే ఓపెన్ అవుతాయనే ఆశతో ఉన్నారు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు. కానీ, పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. థియేటర్లు ఓపెన్ చేసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి స్వేచ్ఛనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తేనే ఎక్కువ నష్టం ఉంటుందని గ్రహించిన ఎగ్జిబిటర్లు ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ స్పీడ్‌గా కంప్లీట్ చేసి త్వరలో ఓటీటీలో రిలీజ్ చెయ్యాలని భావిస్తోంది చిత్ర యూనిట్.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌తో డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర పోషించింది. అలాగే బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే మరో కీలక పాత్రలో నటించాడు. టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ఈ సినిమాతోనైనా కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి..













