RK Roja: సినిమాల్లో రోజా సెకండ్ ఇన్నింగ్స్ షురూ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) ఆర్.కె.రోజా (R K Roja) ఎంతో పాపులర్. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. అయితే 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె కాస్త కూల్ అయ్యారు. రాజకీయంగా కాస్త విరామం దొరకడంతో ఇప్పుడామె సినిమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సినిమాల్లో రోజా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమె వెండితెరపై అడుగు పెడుతున్నారు. ఓ తమిళ సినిమాలో రోజా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రోజా ప్రస్తుతం తమిళ చిత్రం ‘లెనిన్ పాండియన్’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రోజా తెలుగు, తమిళ సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆమె తమిళ చిత్రసీమలో ఓ వెలుగు వెలిగారు. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. టాప్ హీరోలందరితోనూ ఆమె నటించారు. మొదట్లో ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నా, ఆ తర్వాత ఆమె లక్కీ స్టార్ గా ఎదిగారు. ఆమె ఉందంటే ఆ సినిమా హిట్టే అన్నట్టు పాపులర్ అయ్యారు. అయితే ఆ తర్వాత రాజీకీయాల్లోకి ప్రవేశించడంతో సినిమాలకు దూరమయ్యారు.
అయితే,రాజకీయాల్లోకి రాకముందు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యాంకర్ లేదా జడ్జిగా వ్యవహరించారు. కళారంగానికి తాను దూరం కాలేనని పలుమార్లు చెప్పారు. కానీ, పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించలేదు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రోజాకు రాజకీయంగా కొంత ఖాళీ సమయం దొరికింది. అడపాదడపా ఆమె తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, మంత్రిగా లేదా ఎమ్మెల్యేగా ఉన్నంత చురుగ్గా ఉండటం లేదు. ఏపీలో 2029లో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె క్రియాశీలకంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆమె సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా తమిళ రాజకీయాల్లోకి వెళ్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. తమిళనాడులో ఆమెకు ఉన్న ప్రజాదరణ, భాషపై పట్టు దీనికి ప్రధాన కారణాలు. అయితే, రోజా సన్నిహితులు ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన రోజాకు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. రోజా తెలుగు రాజకీయాలపైనే దృష్టి సారించినప్పటికీ, ప్రస్తుత రాజకీయ విరామాన్ని సినీ రంగంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మొత్తం మీద, రోజా కొంతకాలం రాజకీయాలను పక్కనపెట్టి సినిమాల్లోకి రావడాన్ని ఆమె అభిమానులు స్వాగతిస్తున్నారు. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా దూరమయ్యే అవకాశాల్లేవని రోజా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.







