బాలీవుడ్ లో మరో విషాదం… నటుడు రిషీకపూర్ మృతి
బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ గత ఏడాది అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా రిషీకపూర్ మృతిపై అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖులు రిషీకపూర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే.
1952, సెప్టెంబర్ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్ మేరా నామ్ జోకర్ చిత్రంలో బాల నటుడుగా ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్, ట్రెండ్ సెట్టర్ కావడం తో లవర్ బాయ్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. తొలి చిత్రం బాబీ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఇప్పటి వరకు 51 సినిమాలలో నటించారు అందులో 41వరకు మల్టీస్టారర్ చిత్రాలు కావడం విశేషం. రిషీకపూర్ నీతూ సింగ్ ఇద్దరు కలిసి ఎన్నోసూపర్ హిట్ మూవీస్ లో చేసారు. ఆ నేపథ్యంలో 1980లో హీరోయిన్ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరో గా వున్నాడు. రిషీకపూర్ నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.













