‘భీమ్లా నాయక్’ రివ్యూ పై ఆర్జీవీ, హరీష్ శంకర్, బండ్ల గణేష్ ల కామెంట్స్
‘భీమ్లా నాయక్’ ఓ మెరుపు, పవన్ కళ్యాణ్ ఓ సునామీ : రామ్ గోపాల్ వర్మ
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెడుతూ ‘భీమ్లా నాయక్’ వెండితెరపైకి వచ్చేశాడు. అయితే ఈ సినిమా చూసిన రామ్ గోపాల్ వర్మ తన ఫీలింగ్స్ బయటపెట్టారు. మొత్తానికి ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పడింది. నేడే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ మేనియా నడుస్తోంది. జనంతో థియేటర్స్ కిటకిటలాడుతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుండగా.. ఈ నేపథ్యంలో తాజాగా వివాదాస్పద వీరుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి తన రివ్యూ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా పలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆర్జీవీ.. తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాపై స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలా ఉంది? పవన్, రానాల నటన సంగతేంటి? అనే అంశాలను తీసుకొని రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే ఈ సినిమాపై వర్మ సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా మూవీ ఓ మెరుపు లాంటిదని పేర్కొన్న వర్మ.. పవన్ కళ్యాణ్ ఓ సునామీ అనేశారు. ఇక రానా అయితే పవన్‌తో పాటీ పడీ నటించారని చెబుతూ ఆయనకు ఫుల్ మార్క్స్ వేసేశారు. అంతేకాదు భీమ్లా నాయక్ సినిమా భూకంపం సృష్టించిందని అన్నారు. అలాగే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తే అక్కడ సంచలనం సృష్టించి ఉండేదంటూ తన ఫీలింగ్స్ తెలిపారు వర్మ. కాగా, రీసెంట్గా వచ్చిన ‘పుష్ప’ సినిమా బీటౌన్‌లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి అల్లు అర్జున్‌ని అంతలా పొగిడే వర్మ ఈ భీమ్లా నాయక్ మూవీ హిందీ రిలీజ్ గురించి మాట్లాడరంటే అందులో ఏదో లాజిక్ ఉండే ఉంటుందని అనుమాన పడుతున్నారు నెటిజన్లు. ఏదేమైనా వర్మ పెట్టిన ఈ స్మాల్ రివ్యూ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్, రానా, తమన్‌లపై ప్రశంసల వర్షం : హరీష్ శంకర్..
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందిన ‘భీమ్లా నాయక్’ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన రివ్యూ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భీమ్లా నాయక్ మేనియానే కనిపిస్తోంది. ప్రీమియర్స్ మొదలుకొని మార్నింగ్ షో, మ్యాట్నీ షోస్ జనంతో నిండిపోయాయి. పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం చూసి హుషారెత్తిపోతున్నారు ఫ్యాన్స్. మరోవైపు రివ్యూలు సైతం పాజిటివ్ గానే రావడంతో ‘భీమ్లా నాయక్’ హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరుస ట్వీట్స్ పెట్టారు డైరెక్టర్ హరీష్ శంకర్. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ రేంజ్లో ఈ సినిమాను రూపొందించింది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు పవన్ కళ్యాణ్. డానియల్ శేఖర్‌గా రానా పోటీపడి నటించారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించాయి. అయితే ఈ మూవీ తొలి షో చూసిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్, రానా, తమన్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. థియేటర్లలో పవన్ కళ్యాణ్ గర్జించారని, సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్ చాలా గొప్ప సినిమా తీశారని హరీష్ శంకర్ అన్నారు. సినిమాకు తమన్ మ్యూజిక్ వెన్నుముక అని తెలుపుతూ చిత్ర నిర్మాత నాగవంశీ సహా చిత్రయూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. బావా.. ఇది కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే కాదు, భీమ్లా నాయక్ సినిమాకు బ్యాక్ బోన్ అంటూ తమన్‌ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు హరీష్. చిత్రంలో ప్రతి సీన్ ఎంజాయ్ చేశానని, తమన్ బాణీలు పిచ్చెక్కించాయని తెలిపారు. రానా అయితే అదరగొట్టేశాడంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు హరీష్ శంకర్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్‌తో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే పేరు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ రేంజ్లో ఈ సినిమా రూపొందుతోంది.
దేవర అంటూ బండ్ల గణేష్ ట్వీట్
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు. మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని ట్వీట్ వేశాడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. బండ్ల గణేష్ హడావిడే ఎక్కువగా ఉంటుంది. బండ్ల గణేష్ స్పీచ్‌లు లేనదే.. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లు జరగవు. బండ్లన్న స్పీచులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బండ్ల గణేష్‌కు, ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తాడా? లేదా? అని వారం ముందే చర్చలు ప్రారంభించేశారు. అయితే బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ బండ్లన్న ఖండించాడు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఆహ్వానం అందలేదేమో.. ఏం జరిగిందో గానీ మొత్తానికి బండ్లన్న రాకపోవడం, ఆయన స్పీచు లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో బండ్లన్న ఎక్కడ అంటూ అభిమానులు హంగామా చేసేశారు ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.













