Movie Tickets: కార్మికులకు వాటా ఇస్తేనే టికెట్ రేట్ల పెంపు.. రేవంత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..!?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (Tollywood) నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలను సరిదిద్దే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్ ధరలు (Ticket Rates) పెంచుకోవాలని కోరుకునే ఏ నిర్మాత అయినా, ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలని షరతు విధించారు. ఈ నిబంధనను అంగీకరించి, అమలు చేస్తేనే టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రకటన తెలుగు సినీ పరిశ్రమలో, ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే నిర్మాతల్లో పెద్ద చర్చకు దారితీసింది.
సాధారణంగా, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు, భారీ పెట్టుబడులు, హీరోల పారితోషికాలను దృష్టిలో ఉంచుకుని, మొదటి వారం లేదా రెండు వారాల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ అదనపు ఆదాయం సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలకే పరిమితమవుతోంది. సినిమా నిర్మాణంలో వెనుక ఉండి కష్టపడే లైట్ మెన్, సెట్ వర్కర్లు, జూనియర్ ఆర్టిస్టులు వంటి దినసరి కార్మికులకు మాత్రం ఎలాంటి అదనపు ప్రయోజనం లభించడం లేదు. ఇటీవల కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన నేపథ్యంలో, వారి శ్రమకు తగిన ఫలితం దక్కేలా చూడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సినీ కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. 20శాతం వాటాతో పాటు, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, సినీ కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున తక్షణమే రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, సినీ కార్మికుల పిల్లల కోసం కృష్ణానగర్ ప్రాంతంలో స్థలం చూస్తే, నర్సరీ నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించే పాఠశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయి సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌గా మారుస్తామని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఈ నిర్ణయం అమలుపై భవిష్యత్తులో జారీ చేయబోయే జీఓలో పూర్తి విధివిధానాలు స్పష్టం కానున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ల పెంపు వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లడం, న్యాయస్థానం పెంపును సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం తాజా ప్రకటన నిర్మాతలందరికీ ఒక స్పష్టమైన మార్గాన్ని చూపింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అనివార్యంగా మారిన ఈ తరుణంలో, ఈ 20శాతం షరతును నిర్మాతలు అంగీకరించక తప్పదనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల సినీ కార్మికులు లబ్ది పొందుతారని ఆశిస్తున్నారు.







