Revanth Reddy: సినిమా ఇండస్ట్రీని చావు దెబ్బ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి..!!
తెలుగువాళ్లకు, సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాలను ఎంటర్టయిన్మెంట్ (entertainment) గా చూస్తారు. సినిమాలు (Cinema) చూడకుండా అస్సలు ఉండలేరు. అందుకే భారతదేశంలో తెలుగు సినీ చిత్ర పరిశ్రమ (Tollywood) అగ్రగామిగా ఉంది. ఇటీవలికాలంలో తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి పలు వరాలు కురిపిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి వరాలు ఇకపై ఉండబోవని తేల్చి చెప్పింది. ఇది తెలుగు సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప-2 (Pushpa-2) సినిమాకు తెలంగాణ ప్రభుత్వం భారీ వరాలిచ్చింది. పెయిడ్ ప్రీమియర్ షోలకు కూడా అనుమతులిచ్చింది. ఈ షోల ధరలు ఆకాశాన్నంటాయి. మల్టీప్లెక్స్ లలో ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.1200 వరకూ ఉండగా.. సాధారణ థియేటర్లలో రూ.500 వరకూ ఉంది. అంతేకాక మొదటి 4 రోజులు టికెట్ రేట్ల (ticket rates) పంపునకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీంతో మొదటి వారంలోనే పుష్ప-2 కలెక్షన్లు 1600 కోట్లు దాటి చరిత్ర సృష్టించాయి. అయితే పుష్ప-2 బెనెఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, మరో బాలుడు కొనఊపిరితో ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతిచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. అంతేకాక.. టికెట్ రేట్లను కూడా పెంచబోమని స్పష్టం చేశారు. వీటికోసం తన వద్దకు ఎవరూ రావద్దని కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా కంగుతింది. సంక్రాంతికి కొన్ని పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) తో పాటు బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ (Daku Maharaj), వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ ఛేంజర్ కు రూ.400 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్టు అంచనా. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజు (Dil Raju) నిర్మాత. ఇటీవలే ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ (FDC) గా నియమితులయ్యారు.
FDC ఛైర్మన్ దిల్ రాజు సినిమాలకు కూడ రేవంత్ రెడ్డి అనుమతులు ఇవ్వకుండా ఉంటారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఒకవేళ వాటికి ఇస్తే రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గినట్లవుతుంది. కాబట్టి ఈ విషయంలో దిల్ రాజు సినిమాలకు కూడా రేవంత్ రెడ్డి మినహాయింపులు ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. మొదటివారంలోపే సినిమా పెట్టుబడులతో పాటు లాభాలను ఆర్జించాలని నిర్మాతలు, హీరోలు భావిస్తున్నారు. అలాంటప్పుడు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడం లాంటి వెసులుబాట్లు లేకపోతే పెట్టుబడి వస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే నిర్ణయం ఏపీ కూడా తీసుకుంటే తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమని సినీ పండితులు భావిస్తున్నారు.













