పుష్పరాజ్‌కు కూడా తప్పని రీషూట్స్
ఏదైనా స్టార్ హీరో సినిమాకు సంబంధించి రీ షూట్స్ జరుగుతున్నాయంటే ఒకప్పుడు ఫ్యాన్స్ తెగ కంగారు పడే వాళ్లు. రీ షూట్స్ అనేది ఒక నెగిటివ్ సెంటిమెంట్ గా భావించేవాళ్లు. కానీ ఎప్పుడైతే సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలు రీషూట్స్ చేయడం ద్వారా మంచి అవుట్ పుట్ ను తీసుకువచ్చి ఆ విషయాన్ని బయటకి చెప్పారో రీ షూట్స్ విషయంలో అందరి ఆలోచనా ధోరణి మారింది.
చేసిన సీన్ విషయంలో ఏదోక విధంగా అసంతృప్తి ఉంటే దాన్ని రీషూట్ చేసి మెరుగుపరిస్తే మంచే తప్ప చెడేముందనే ఫీలింగ్ కు వచ్చేశారంతా ఇప్పుడు. అసలు ఇప్పుడీ విషయం ఎందుకొచ్చిందంటే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప2 టీమ్ కూడా ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప2 రిలీజ్ కు మరో 73 రోజులే ఉంది.
వాస్తవానికైతే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉండాలి కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం, కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయడంలో బిజీగా ఉన్నారు సుక్కు టీమ్. తాను చేసిన కొన్ని సీన్స్ పట్ల స్వయంగా బన్నీనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ చేద్దామనడంతో ఆ సీన్స్ ను రీషూట్ చేస్తున్నారని సమాచారం. మరో రెండు మూడు వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టాలని టీమ్ చూస్తోంది. ఆగస్ట్ 15న పుష్ప2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













